భూదానమా.. భూ దాహమా..
రెవెన్యూ భూములుగా ప్రకటించిన సర్కార్
జిల్లాలో ఉన్నవి 265 ఎకరాలు
{పభుత్వాధీనంలో 65 ఎకరాలే
మెజార్టీ భూముల్లో రైతుల సాగు
భూదాన భూములపై ‘అధికారం’ కన్నుపడింది. ఇప్పటికే వీటిని రెవెన్యూ భూములుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. ఎలాగైనా పాగా వేయాలని అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఆచార్య వినోభాబావే ఉన్నత ఆశయాలతో శ్రీకారం చుట్టిన భూదాన ఉద్యమం వీరి చర్యల ఫలితంగా నీరుగారిపోతుంది.
విశాఖపట్నం: పరిమితికి మించి ఉన్న భూములను సేకరించి పేదలకు పంచాలన్న సదాశయంతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి వినోభా బావే భూములను సమీకరించిన సంగతి తెలిసిందే. రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమంలో భాగంగా సర్కార్ కన్ను ఈ భూదాన భూములపై పడింది. ఏదో విధంగా స్వాధీనం చేసుకుని ఇతరావసరాల కోసం వినియోగంచాలన్న ఆలోచనతో సర్కారీ భూములుగా ప్రకటించింది. జీవో కూడా జారీ చేసింది. దీంతో వీటిని రెవెన్యూ భూములుగా పరిగణిస్తారు.
జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాలను సేకరించినప్పటికీ ప్రస్తుతం రికార్డుల ప్రకారం 264.90 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 20.91 ఎకరాలు వెట్, 243.99 ఎకరాలు డ్రై ల్యాండ్స్గా రికార్డుల్లో ఉన్నాయి. మొత్తం భూముల్లో 65 ఎకరాలు ప్రభుత్వాధీనంలో ఉండగా మిగిలినవి రైతులు, స్ధానికుల అధీనంలో ఉన్నాయి. సబ్బవరం మండలం దొంగలమర్రి సీతారాంపురంలో సర్వే నెంబర్ 1549లో 52.38 ఎకరాలు వివాదంలో కోర్టులో నలుగుతోంది. మిగిలిన భూముల్లో పరదేశిపాలెంలో సర్వే నెంబర్ 132లో 50.56 ఎకరాలతో పాటు అర్బన్ మండల పరిధిలోని మాధవదారలో సర్వేనెం: 66/1లో ఉన్న 15.45 ఎకరాల్లో 10 ఎకరాలు, గాజువాక మండలం అగనంపూడిలో సర్వే నెం: 56/ఏ,బీలలో ఉన్న 20 ఎకరాల్లో నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. మిగిలినవన్నీ స్థానికులు, రైతుల అధీనంలోనే ఉన్నాయి. చాలా భూములు ఆక్రమణలకు గురికాగా, 60 ఏళ్లుగా ఎన్నో చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లో కూడా పెద్ద సంఖ్యలో భూదాన భూములున్నాయి. వీటిలో భారీ భవంతులు.. బహుళ అంతస్తుల నిర్మాణాలు కూడా ఉన్నాయి. అసలు ఈ భూములు ఎక్కడ ఉన్నాయో అధికారులకు కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
ఇన్నాళ్లూ ఏమాత్రం పట్టించుకోని అధికారులు ప్రస్తుతం వీటిని గుర్తించే పనిలో పడ్డారు. ఎవరిఅధీనంలో ఉన్నాయి? ఎన్ని చేతులు మారాయి? వాస్తవస్థితి ఎలా ఉంది ? వంటివిషయాలపై దృష్టిసారించారు. వీటి స్థితిగతులపై సమగ్ర నివేదిక రూపొందించే పనిలోపడ్డారు. మార్గదర్శకాలు జారీ అయిన వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులు..అనుభవిస్తున్న సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ తాతముత్తాల నుంచి అనుభవిస్తున్న వీటిని ఇప్పటికిప్పుడు స్వాధీనం చేసుకోవాలని చూస్తే తామేమైపోతామని వారు ప్రశ్నిస్తున్నారు.