ఎమ్మెల్సీ ఎన్నికకు నేడు నోటిఫికేషన్
ఓటర్ల నమోదుకు నేటితో గడువు పూర్తి
ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం
250 మంది అధికారులు, సిబ్బంది నియామకం
ఏలూరు :ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ కేవీవీ చైతన్యరాజు పదవీ కాలం మార్చి 29తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణకుమార్ గురువారం ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ ప్రతులను జిల్లాలోని కలెక్టరేట్, ఆర్డీవో, 49 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ప్రదర్శించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు అసిస్టెంట్ రిటర్నింగ్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.
ఈ నెల 26వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 27న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు మార్చి 2వరకు గడువు ఇచ్చారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించి, 19న కౌంటింగ్ చేపడతారు. ఈ పదవికి ఇప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్సీ కేవీవీ చైతన్యరాజు, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, సీఆర్ఆర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ రాము సూర్యారావు, ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ పరుచూరి కృష్ణారావు, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఓటర్ల జాబితాల్లో ఫొటోలు తప్పనిసరి
జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగియనుంది. జిల్లాలోని 48 మండలాల్లో ఇప్పటివరకు మొత్తం 9,265 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఫొటోలున్న ఓటర్లు మాత్రం 5,942మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,771మంది కాగా, మహిళా ఓటర్లు 2,171 మంది ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా 3,323 మంది ఓటర్లకు ఫొటోలు లేవు. వీరంతా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఫొటోలను సమర్పిం చాల్సి ఉంది.
కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు సమర్పించిన వారి వివరాలను జాబితాలో పొందుపర్చే కార్యక్రమం ఈ నెల 26వ తేదీతో ముగియనుం ది. తుది ఓటర్ల జాబితాలను ఈ నెల 27 పోలింగ్ కేం ద్రాల వద్ద ప్రదర్శనకు ఉంచుతారు. ఫొటోలను సమర్పించని వారి పేర్లను ఓటర్ల జాబితాలోంచి ఫారం-21 ఏ ప్రకారం తొలగిస్తారని కలెక్టరేట్ వర్గాలు తెలి పాయి. ఈ దృష్ట్యా ఓటర్ల జాబితాలో పేర్లున్న వారంతా తక్షణమే ఫొటోలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆరు రూట్లలో పోలింగ్ సామగ్రి తరలింపు
గత ఎన్నికల వరకు ఐదు రూట్లలో పోలింగ్ మెటీరి యల్ను పంపేవారు. ఇప్పుడు కొత్తగా రెండు మండలాలు కలవడంతో ఆరు రూట్లకు పెంచారు. ఆరుగురు రూట్ ఆఫీసర్లు, ఆరుగురు జోనల్ ఆఫీసర్లు, పోలింగ్ కేంద్రానికి పీవో, ఏపీవో, ఇద్దరు సిబ్బంది చొప్పున మొత్తం 215 మంది పనిచేస్తారు. 10 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వులో ఉంచనున్నారు. అధికారులు, సిబ్బంది కలసి మొత్తంగా 250 మంది విధులు నిర్వహిస్తారు.