ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణి (గ్రీవెన్స్‌డే)కి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌లో జరిగిన ప్రజావాణి (గ్రీవెన్స్ డే)లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు శ్రద్ధ చూపాలన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
కారేపల్లి మండలం ఉసిరికాయపల్లి గ్రామానికి చెం దిన అలివేలు మంగతాయారు తనకు గ్రామ సర్వే నం బర్ 104/2లో 4 ఎకరాల 13 గుంటల భూమి ఉందని, తనకు భూమికి సంబంధించిన పాస్ పుస్తకం కూడా ఉందని, ఇటీవల పహాణీలో గుగులోతు ద్వాలీ, గుగులోతు బాలాజీ పేర్లతో అధికారులు భూమిని ఎక్కించారని, తనకు న్యాయం చేసి, అక్రమంగా పేర్లు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని, వర్షాకాలం సమయంలో రోడ్లన్నీ బురదమయంగా మారి నడిచే పరిస్థితి కూడా లేకపోయిందని, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తమ భూముల్లో బోర్లు వేయించుకున్నా ఉపయోగం లేకుండాపోతోందని, శాస్త్రీయంగా భూగర్భజలాలు సర్వే చేయించి ప్రభుత్వ పథకాల్లో బోర్లు మం జూరు చేయాలని వేంసూరు జెడ్పీటీసీ బాషా, ఎర్రగుంట పాడు గ్రామస్తులు జక్కా బ్రహ్మ య్య, చిలకా వసంతం, కృష్ణయ్య, వాసం వెంకటేశ్వరరావు, మంగయ్య, యాకూబ్ విన్నవించారు.
జిల్లాలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, దీంతోపాటు రెట్టిం పు ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజుల నియంత్రణ చట్టం ఉన్నా అమలు చేయడం లేదని, దానిని సక్రమంగా అమలు జరిగేలా చూడాలని పీడీఎస్యు నాయకులు సునీల్‌కుమార్, ఆజాద్, వెంకటేష్, సౌందర్య, శిరీష వినతిపత్రం సమర్పించారు.
తిరుమలాయపాలెం మండలం తిరుమలాయపాలెం, ముజాహిద్‌పురం, సుద్దవాగుతండా, కాకరవాయి తది తర గ్రామాల సమీపంలో ఉన్న పాలే రు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ తహసీల్దార్ కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు రవి, వెంకటరెడ్డి, రమేష్, మోహన్ విన్నవించారు.
ఖమ్మంలో ఐటీడీఏని ఏర్పాటుచేయాల ని ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు భద్రూనాయక్, నగేష్, రమేష్, వెంకన్న విన్నవించారు.