పని ఉందంటూ బయటకు తీసుకెళ్లి..
రాయ్ పూర్: తమ మాట పెడచెవిన పెట్టారంటూ ఓ రెవెన్యూ అధికారిని నక్సల్స్ కాల్చి చంపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అకబెడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్థావరాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళిక వేశారు. ఇందుకోసం కోడ్కనర్ గ్రామానికి చెందిన సోమారు గోటా(45) అనే రెవెన్యూ సర్వేయర్‌ను నియమించారు.
అయితే, ఈ ప్రయత్నాన్ని మావోయిస్టులు మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నారు. కానీ సోమారు గోటా తన ప్రయత్నం విరమించలేదు. దీంతో శుక్రవారం రాత్రి సుమారు 40 మంది మావోయిస్టులు అక్కడికి చేరుకుని సోమారు గోటాను పని ఉందంటూ బయటకు తీసుకెళ్లారు. శనివారం ఉదయం ఆయన మృతదేహం అకబెడ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.