ఇలా విభజిద్దాం!
♦ జిల్లాల పునర్విభజనపై మార్గద ర్శకాలు జారీ
♦ ఆఫ్ సెంచరీకి చేరనున్న మండలాల సంఖ్య
♦ జిల్లా పరిధిలోనే ప్రతిపాదిత జిల్లాలు
♦ మ్యాపులు, సమాచారాన్ని కోరిన ప్రభుత్వం
జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. వీటికి అనుగుణంగా కొత్త జిల్లాల ప్రతిపాదనలను పంపాలని నిర్దేశించింది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు సహా ప్రతిపాదిత జిల్లాల సమగ్ర సమాచారాన్ని నివేదించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమండ్ పీటర్ జిల్లా యంత్రాంగానికి లేఖ రాశారు. గత నెల 23న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదిత జిల్లాల బ్లూప్రింట్‌ను తయారు చేయాలని స్పష్టం చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నయా జిల్లాల ఏర్పాటుపై కృతనిశ్చయంతో ఉన్న సర్కారు.. జూన్ 2న ప్రతిపాదిత జిల్లాలను ప్రకటించాలని తొలుత భావించింది. అయితే, జిల్లాల విభజనలో శాస్త్రీయత పాటించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి.. సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది. నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ సెగ్మెంట్ల స్థానే 153 పెరుగుతున్నందున వాటికి అనుగుణంగా కొత్తగా 24 లేదా 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
జిల్లాను పరిధిలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక మండలం పరిధిలోకి పక్క మండలం, ఒక నియోజకవర్గంలోకి సరిహద్దు సెగ్మెంట్లోని మండలాన్ని కలిపేందుకు వెసులుబాటు కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పక్క జిల్లాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలనుకుంటే అది ప్రభుత్వ స్థాయిలో తీసుకునే విధానపర నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికారవర్గాలు అంటున్నాయి.
లక్షకో మండలం
కొత్త మండలాలపై రెవెన్యూ యంత్రాంగం మళ్లీ కసరత్తు చేస్తోంది. వాస్తవానికి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 37 మండలాలకు అదనంగా మరో 12 న్యూ మండలాలను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే, తాజాగా లక్ష జనాభాకో మండ లం ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీంతో ఇప్పుడున్న జిల్లాలో మండలాల సంఖ్య 50పైగా దాటనుంది. ఈ మేరకు మండలాల పునర్విభజనపై రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
విభజనకు ‘పంచ’సూత్రాలు
రెవెన్యూ పునర్వ్యవస్థీకరణలో ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రస్తుత జిల్లా జనాభా/ ప్రతిపాదిత జిల్లా జనాభా/ డివిజన్/ మండల జనాభాను పంపాలని ఆదేశించింది. అలాగే మ్యాపుల తయారీలోనూ ఇదే తరహా ఫార్ములాను వినియోగించాలని సూచించింది. ప్రతిపాదిత జిల్లా లేదా రెవెన్యూ డివిజన్లో ఏయే మండలాలను కలుపుతున్నారు? ఏయే అసెంబ్లీ సెగ్మెంట్లు ఆ డివిజన్ పరిధిలోకి వస్తున్నాయో విశదీకరించాలి. ప్రతిపాదిత జిల్లా/ డివిజన్/ మండల నైసర్గిక స్వరూపాన్ని కూడా పొందుపరచాలని ఆర్డీఓలను ఆదేశిస్తూ జిల్లా క లెక్టర్ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాకుండా అవసరమైన ఉద్యోగుల సంఖ్య, ఆర్థికంగా పడే ప్రభావం, నీటి పన్ను, ఓటీసీ తదితర రాబడిపై కూడా సమాచారాన్ని నివేదించాలని స్పష్టం చేశారు.