అక్రమ-సక్రమకు బీబీఎంపీ ఓకే
రెవెన్యూ సైట్లకు ‘ఏ’ ఖాతాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో రెవెన్యూ సైట్లను కలిగి ఉన్న పౌరులకు శుభ వార్త. బెటర్మెంట్ చార్జీలు వసూలు చేయడం ద్వారా ఆ సైట్లను క్రమబద్ధీకరించాలని (‘ఏ’ ఖాతా) బీబీఎంపీ నిర్ణయించింది. బీబీఎంపీ పరిధిలోని పాత, కొత్త వార్డులకు ఈ నిర్ణయం అన్వయిస్తుంది. పాత వార్డుల్లో చదరపు మీటరుకు రూ. 200, కొత్త వార్డుల్లో రూ.250 చొప్పున బెటర్మెంట్ చార్జీలను వసూలు చేస్తారు.
రెవెన్యూ సైట్లను క్రమబద్ధీకరించాలన్న బీబీఎంపీ నిర్ణయానికి పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. బహుశా బుధవారం నుంచే బెటర్మెంట్ చార్జీల వసూలుకు శ్రీకారం చుడతారు. బెంగళూరు చుట్టుపక్కల లక్షల సంఖ్యలో రెవెన్యూ సైట్లు ఉన్నాయి. వీటికి ‘ఏ’ ఖాతా లేకపోవడంతో బ్యాంకులు గృహ రుణాలు ఇవ్వడం లేదు. అలాంటి సైట్ల యజమానులకు బీబీఎంపీ నిర్ణయంతో ఉపశమనం కలిగింది.