దూసుకుపోయిన 'హీరో'
న్యూఢిల్లీ : టూవీలర్ దిగ్గజం హీరో మోటార్ కార్పొ, స్ట్రీట్ అంచనాలను అధిగమించి రయ్మని దూసుకుపోయింది. బుధవారం వెలువరిచిన రెండో క్వార్టర్ ఫలితాల్లో పన్నుల అనంతరం లాభాల్లో 28 శాతం వృద్ధి సాధించి, రూ.1,004 కోట్ల లాభాలను నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.772 కోట్లగా ఉన్నాయి. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం హీరో మోటార్ కార్పొ ఈ క్వార్టర్లో కేవలం రూ.926 కోట్ల లాభాలను మాత్రమే రికార్డు చేస్తుందని తెలిసింది. కానీ అంచనాలు మించి హీరో మోటార్ కార్పొ దూసుకుపోయింది.
అన్ని త్రైమాసిక ఫలితాల్లో కెల్లా ఇవే అత్యంత ఉత్తమమైన క్వార్టర్లీ ఫలితాలుగా హీరో మోటార్ కార్పొకు నిలిచాయి. ఈ త్రైమాసికంలో హీరో మోటార్ కార్పొ రికార్డు స్థాయిల్లో 18,23,498 మోటార్ సైకిల్స్ విక్రయాలను చేపట్టినట్టు ప్రకటించింది. ఇవి గతేడాది కంటే 15.8 శాతం వృద్ధి అని కంపెనీ వెల్లడించింది. కాగ, కంపెనీ రూ.1000కోట్లకు పైగా క్వార్టర్లీ లాభాలను నమోదుచేయడం ఇదే మొదటిసారని హీరో మోటార్ కార్పొ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్ తెలిపారు. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.7,386 కోట్లగా ఉన్న కంపెనీ రెవెన్యూలు, ఈ త్రైమాసికంలో 15 శాతం ఎగిసి, రూ.8,449 కోట్లగా నమోదయ్యాయి.