జనరిక్ మందుల పంపిణీకి ఇంటింటా సర్వే
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి జనరిక్ మందులు అందించేందుకు వారి వివరాలను ఇంటింటా తిరిగి సేకరించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్డీఏ అధికారుల సమావేశంలో జనరిక్ మందుల విక్రయాలు, చంద్రన్న బీమా పథకం అంశాలపై కలెక్టర్ సమీక్షిం చారు. జిల్లాలో ఏటా రూ.వెయ్యి కోట్లు విలువైన మందుల అమ్మకాలు జరుగుతున్నాయని, డ్వాక్రా గ్రూపుల ఆధ్వర్యంలో జిల్లాలో 200 జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసి కనీసం రూ.200 కోట్ల మందులను విక్రయించేస్థాయికి చేరేలా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ డాక్టర్లు బ్రాండెడ్ బదులు జనరిక్ మందులనే ప్రిస్కిప్షన్‌లో రాసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, మెప్మా పీడీ డాక్టర్ ఎన్.ప్రకాశరావు పాల్గొన్నారు.
ఆర్ఆర్ ప్యాకేజీపై అవగాహనకు గ్రామ సభలు
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు చెల్లించే ఆర్ ఆర్ ప్యాకేజీ పునరావాస కార్యక్రమాలపై అవగాహన కలిగించడానికి ఈనెల 30 నుంచి జూన్ 12 వరకు 19 గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, తదితర అంశాలపై ఐటీడీఏ పీఓ షాన్‌మోహన్‌తో కలెక్టర్ చర్చించారు.నిర్వాసిత గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమాలపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కలిగించడానికి విస్తృతమైన చర్చ జరపాలని షాన్మోహన్ను కలెక్టర్ ఆదేశించారు. 30న టేకూరు, చీడూరు, 31న కొరుటూరు, శివగిరి, జూన్ 1న సిరివాక, తెల్లదిబ్బలు, 2న తూటిగుంట, 3న పల్లవూరు, పైడాకులమామిడి, 5న సరుగుడు, యర్రవరం, 6న కొత్తూరు, 7న కొత్తమామిడిగొంది, మాధాపురం, 8న ములగలగూడెం, గాజులగొంది, 9ప వాడపల్లి, 10న తల్లవరం, 12న కోండ్రుకోట గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. జేసీ పి.కోటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న పాల్గొన్నారు.