reviewed by CM
-
ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినండి !
ఒంగోలు సబర్బన్: ‘ఎన్నికలు దగ్గరపడుతున్నాయి...ఇక ఆరు నెలలు మాత్రమే ఉంది. అందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెప్పినట్లు అధికారులు వినాలి. చెప్పిన పనులు చెప్పినట్లు చేయాలి. పథకాల అమలులో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించాలి. రానున్న ఎన్నికలకు నాయకులు సన్నద్ధం కావాలంటే ప్రభుత్వ పథకాల అమలులో ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా తయారు చేయాలని’ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన సందర్భంగా శనివారం స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇన్చార్జ్ మంత్రి పి.నారాయణ, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సమీక్ష అనంతరం జిల్లా సమాచారం పౌరసంబంధాల శాఖ అధికారులు సీఎం సమీక్షకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన మేరకు...రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. జిల్లాలో విస్తారమైన వనరులు ఉన్నాయని, వాటిని వినియోగించుకొని అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతికి గుంటూరు తరువాత ప్రకాశం జిల్లా అని రాబోయే రోజుల్లో జిల్లాకు మహర్దశ రాబోతుందన్నారు. జిల్లాలో విస్తారమైన కోస్తాతీరం ఉందని, మత్స్యసంపద, ఆక్వా, గెలాక్సీ గ్రానైట్ వనరులున్నాయని వివరించారు. వీటిని వినియోగించుకొని వృద్ధి రేటు సాధించాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు వస్తేనే ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో దొనకొండ కారిడార్, కనిగిరి నిమ్జ్, రామాయపట్నం పోర్టు, ఉద్యాన యూనివర్శిటీ, మైనింగ్ యూనివర్శిటీ, వ్యవసాయ యూనివర్శిటీలను ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని పథకాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సాంకేతికతను వినియోగించుకొని నేరాలు జరగకుండా పోలీస్ వ్యవస్థ ప్రజలకు రక్షణగా ఉండాలన్నారు. పోలీసులు ప్రజల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రులతో పాటు కలెక్టర్ వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ టి.నిశాంతి, జిల్లా ఎస్పీ బూసరపు సత్య ఏసుబాబు, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్సీలు కరణం బలరామ కృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, కదిరి బాబూరావు, ఏలూరి సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, ముత్తముల అశోక్ రెడ్డి, పి.డేవిడ్ రాజు, డోలా బాల వీరాంజనేయ స్వామి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ దివి శివరాం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పరువు పోయింది... ఇప్పుడెలా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్ కె రోజాను ఏడాది పాటు సస్పెండు చేస్తూ చేసిన తీర్మానం చెల్లదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో అధికార తెలుగుదేశం పార్టీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడింది. అనేక విషయాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రోజా వాయిస్ ను శాసనసభలో వినకూడదన్న ఆలోచనతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేసిన టీడీపీ నేతలకు హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. రోజాను సస్పెండు చేయడం ద్వారా మొత్తం ప్రతిపక్షాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలన్న రాజకీయ కుట్రకు హైకోర్టు తీర్పు ద్వారా బ్రేక్ పడటం టీడీపీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఆ పార్టీ నేతలు తర్జనభర్జనలో పడ్డారు. చంద్రబాబుతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమై ఇప్పుడేం చేయాలన్న దానిపై సమాలోచనలు జరిపారు. హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించారు. న్యాయవాదుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రతిపక్షంపై కక్ష సాధించడానికి అసెంబ్లీలో అధికార పక్షం తప్పుడు మార్గాల్లో పయనిస్తోందని తాజా హైకోర్టు తీర్పుతో తేలిపోయిందని, ఈ విషయం ప్రజల్లోకి బాగా వెళ్లిందని సమావేశంలో పాల్గొన్న నేతలు వివరించారు. ఈ కేసుపై అప్పీలుకు వెళ్లాలన్న ఆలోచన చేశారు. అలాగే హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటే ఏమవుతుందన్న విషయంపైనా నేతలు చర్చలు జరిపారు. తాజా ఉత్తర్వులపై అప్పీల్ చేయడం ద్వారా పరువు కాపాడుకోగలమా అన్న దిశగా ఆలోచన చేసిన తర్వాత ఆ విషయంలో మరో మహిళా సభ్యురాలితో అప్పీల్ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అధికారపక్షంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. శాసనసభ లాబీల్లో ఎమ్మెల్యేల రకరకాలుగా చర్చించుకుంటున్నారు. శాసనసభ వేదికగా నిబంధనల పేరుతో తమకు సర్వాధికారాలు ఉన్నాయంటూ ఇంతకాలం చేసుకుంటున్న ప్రచారమంతా డొల్ల అని తేలడంతో పరువు పోయిందని నేతలు అభిప్రాయపడ్డారు. నిబంధనల పేరుతోనో, శాసనసభలో సంఖ్యాబలం ఉందన్న నెపంతోనో, ప్రతిపక్షం గొంతు నొక్కాలన్న తమ నేతల ప్రయత్నాలు హైకోర్టు తీర్పుతో బెడిసికొట్టాయని ఒక సీనియర్ సభ్యుడు వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలు తమ ప్రతిష్ఠను దిగజార్చాయని పేర్కొన్నారు. ఏదైనా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మంచిది కాదని ఇప్పటికైనా అధికారపార్టీ నేతలు గుర్తిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం అధికారం లేకపోయినా ఏడాది పాటు సస్పెండ్ చేసి అభాసుపాలు కాగా, స్పీకర్‌పై ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలోనూ ప్రతిబంధకంగా మారిన నిబంధనలను సైతం తొలగించడంతోనే ప్రతిపక్షం విషయంలో టీడీపీ ప్రభుత్వం ఎంత కసితో కక్ష సాధింపు ధోరణితో ఉందే అర్థమవుతోందని అన్నారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. 340 నిబంధన కింద రోజాను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేయగా, ఆ నిబంధన ప్రకారం ఆ సమావేశాలు ఎన్ని రోజులు సాగుతాయో అంతకాలం మాత్రమే సస్పెండు చేయాలని ఆ నిబంధన చెబుతోందని, ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని అదేరోజు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దానిపై కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా రోజాకు ఇవ్వలేదు. తనను సస్పెండ్ చేసిన తీర్మానం ప్రతి కోసం మరుసటి రోజు అసెంబ్లీకి వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది ద్వారా అడ్డుకుని రోజాను శాసనసభ ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రోజా హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు కేసును విచారించడం జరిగాయి.