వాళ్లు ఏడిస్తేనే నాకు ఆనందం!
‘‘వెండితెరపై మనం చూసే రెండున్నర గంటల సినిమా నిజం కాదు. కేవలం ఓ కథ. కానీ, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి, ‘నిజంగా జరుగుతోంది’ అని ఫీలైతే, ఆ సినిమా సక్సెస్ కిందే లెక్క’’ అంటున్నారు కంగనా రనౌత్. క్వీన్, రజ్జో, రివాల్వర్ రాణి.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు ఈ బ్యూటీ. పైగా... అన్నీ కథానాయిక పాత్ర ప్రాధాన్యంగా సాగే సినిమాలు కావడంతో కంగన చాలా ఆనందంగా ఉన్నారు.
ఓ సినిమా చేస్తున్నప్పుడు, ఆ సినిమాలోని పాత్రగా తాను మారిపోతానని చెబుతూ -‘‘కెమెరా ముందుకెళ్లిన తర్వాత నేను కంగన అనే విషయం మర్చిపోతాను. అది ఎలాంటి సన్నివేశం అయినా వంద శాతం న్యాయం చేయడానికి కృషి చేస్తాను. ఉదాహరణకు... ఏడ్చే సన్నివేశాన్ని తీసుకుందాం. గ్లిజరిన్ వాడకుండానే ఏడ్చేస్తాను. నేను యాక్ట్ చేసిన చిత్రాల్లో కొన్నింటిని పబ్లిక్ థియేటర్లో చూస్తాను. అప్పుడు ప్రేక్షకుల హావభావాలు క్షుణ్ణంగా గమనిస్తాను. తెరపై నేను ఏడవడం చూసి, థియేటర్లో ప్రేక్షకులు కంట తడిపెట్టుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
నేను నవ్వినప్పుడు వాళ్లూ నవ్వితే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. ఇలాంటి ఆనందాలు నాకు చాలానే మిగిలాయి. సో.. నటిగా నేను సక్సెస్ అయినట్లేగా. ఇంకో విషయం ఏంటంటే.. ‘కంగన ఇటు గ్లామరస్ అటు పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న పాత్రలు చేస్తుంది. మనం కూడా అలానే చేయాలి. కేవలం గ్లామర్‌కి పరిమితం అయిపోకూడదు’ అని కొత్త తారలు నన్ను రోల్ మోడల్‌గా తీసుకోవాలన్నది నా ఆకాంక్ష. సినిమాలు ఎంపిక చేసుకునేటప్పుడు ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటా’’ అని చెప్పారు కంగనా.