యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి జిల్లాలోని పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒక కార్మికుడు కనకయ్య మృతిచెందినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. పేలుడు కారణంగా పెద్ద శబ్ధం రావడంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను హుటాహుటిన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చికిత్స పొందుతూ కనకయ్య మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, పరిశ్రమ లోపల ఎవరైనా చిక్కుకున్నారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. ప్రమాద ఘటనపై కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన కార్మికుల కుటుంబాల సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనలు తెలుపుతున్నారు.