పోలీసుల అదుపులో షూటర్ రియాజ్
–బుల్లెట్లు, తపంచాలు స్వాధీనం
– జిల్లా కేంద్రంలో నయీమ్‌కు ముఖ్య అనుచరుడిగా పేరు
– భూదందాలు, ఆయుధాల సరఫరా, సెటిల్మెంట్లలో పాత్ర..?
– కొనసాగుతున్న సోదాలు
నల్లగొండ క్రైం
గ్యాంగ్‌స్టర్ నయీమ్ అకృత్యాలలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రధారుల గుట్టు విప్పేందుకు పోలీస్ యంత్రాంగం దూసుకుపోతోంది. దీనిలో భాగంగానే జిల్లా కేంద్రంలో ముఖ్య అనుచరులుగా పేరుగాంచిన షార్ప్ షూటర్ రియాజ్‌తో పాటు టమాట శ్రీను, జహంగీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. రియాజ్ హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో తలదాచుకోగా పోలీసులు కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇతడి వద్ద ఒక తపంచాతో పాటు భారీగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
ఎవరీ రియాజ్..?
రియాజ్ కుటుంబానికి, అతడి ప్రత్యర్థి వర్గానికి చాలా ఏళ్లుగా పాతకక్షలు ఉన్నాయని తెలసింది. ఈ నేపథ్యంలో రియాజ్ కొన్నేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లాడని ప్రచారంలో ఉంది. తన కుటుంబంపై దాడి జరిపిన ప్రత్యర్థివర్గంపై కక్ష పెంచుకుని కొన్నేళ్ల క్రితం తిరిగి వచ్చి ఒకే రోజు నిమిషాల వ్యవధిలో జిల్లా కేంద్రంలో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపి సంచలనం సృష్టించాడని సమాచారం. అయితే ప్రత్యర్థి వర్గం ప్రతికారేచ్ఛతో తనను ఎక్కడ మట్టుబెడుతుందోనన్న ప్రాణభయంతో నయీమ్ పంచన చేరినట్టు తెలుస్తోంది.
ఆయుధాలు, భూదందాలు, సెటిల్మెంట్లు..?
నయీమ్ నేరసామ్రాజ్య విస్తరణలో భాగంగా అతడి పంచన చేరిన రియాజ్ తొలుత భూదందాలు, సెటిల్మెంట్లలో రెచ్చిపోయినట్టు సమాచారం. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ‘భాయ్’ అండతో అడ్డొచ్చిన వారిని బెదిరిస్తూ తన కార్యకలాపాలకు సాగించినట్టు సమాచారం. దీంతో నయీమ్ వద్ద పేరు తెచ్చుకుని ఆయుధాల సరఫరాలో కూడా ముఖ్యపాత్ర పోషించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రియాజ్ ఎక్కుగా నల్లగొండ, మిర్యాలగూడ, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూదందాలు, సెటిల్మెంట్లలో ప్రధాన పోషించాడని తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా నయీమ్ పనిని బట్టి నగదును ముట్టజెప్పేవాడని రియాజ్ పోలీసుల విచారణలో అంగీకరించినట్టు సమాచారం.
ప్రధానంగా ఏడుగురు.. పేరు చెప్పుకుని ..?
జిల్లా కేంద్రంలో నయీమ్ అనుచరవర్గం ప్రధానంగా ఏడుగురు ఉన్నారని సమాచారం. వీరిలో ఇప్పటికే రియాజ్, టమాట శ్రీను, జహంగీర్లు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం. మిగిలిన వారి కోసం కూడా ఖాకీలు వేటను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే నయీమ్ దందాల్లో టమాట శ్రీను. జహంగీర్ పోషించిన పాత్ర కూడా తక్కువేమీ లేదని సమాచారం. వీరు కూడా భూదందాలు, సెటిల్మెంట్లలో ఆరితేరిపోయినట్టు తెలుస్తోంది. వీరిని పోలీసులు లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పోతే పట్టణంలో నయీమ్ పేరు చెప్పుకుని వసూళ్లకు పాల్పడే చోటమోట వారికి లెక్కేలేదని తెలుస్తోంది. అయితే పోలీసులు వారిని కూడా పట్టుకునేందుకు కూపీలు లాగుతున్నట్టు తెలిసింది.