రేయాన్స్ ఫ్యాక్టరీని తెరిపిద్దాం
కార్మికులకు అండగా నిలుద్దాం
9, 10 తేదీల్లో ఢిల్లీకి అఖిలపక్షం
హన్మకొండ సిటీ : జిల్లాలో ఉన్న ఏకైక పరిశ్రమ రేయాన్స్ ఫ్యాక్టరీని తెరిపిం చేందుకు అఖిల పక్ష కమిటీ ముందుకు వచ్చింది. ఫ్యాక్టరీలో నిలిపివేసిన ఉత్పత్తి తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునేలా వత్తిడి తీసుకురానున్నట్లు నాయకులు ప్రకటించారు. గురువారం హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. సీపీఎం, సీపీఐ, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు.
ఈనెల 9, 10 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, పరిశ్రమల శాఖామంత్రి నిర్మలా సీతారమన్ కలిసి రేయాన్స్ ఫ్యాక్టరీని తెరిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు చెప్పారు. అలాగే విదేశాల నుంచి దిగుమతి అవుతున్న పల్పులు తగ్గించి రేయాన్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే వాటిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు వివరించారు.
పరి శ్రమ స్థితిగతులపై తెలంగాణ ముఖ్యం త్రి కేసీఆర్‌తోపాటు రాష్ట్ర కార్మిక మం త్రిని కలిసి వివరించామని పేర్కొన్నా రు. ఫ్యాక్టరీ తెరిపించకపోతే కార్మికుల జీవితాలు ఆగమవుతాయని, సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు సంఘటితంగా ముందుకు పోవాల్సిన అవసరముందని పలువురు నాయకులు పేర్కొన్నారు. కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని చెప్పారు.
సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, టీఆర్ఎస్ యువత జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్రావు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బోంపెల్లి పురుషోత్తంరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చుక్కయ్య, రేయాన్స్ కార్మిక సంఘాల నాయకులు వడ్డెబో యిన శ్రీనివాస్ చొక్కారావు, సింగారం అయిలయ్య, వడ్లూరి రాంచందర్, జనార్ధన్, కుర్భాన్‌అలీ పాల్గొన్నారు.