ముక్కుకోసేసిన భర్త... భార్యకు అండగా ప్రభుత్వం
కాబూల్: భార్యతో గొడవపడి విచక్షణ కోల్పోయిన భర్త ఆమె ముక్కు కోసేసిన దారుణ ఘటన అప్ఘానిస్తాన్ లోని ఘోర్మాక్ జిల్లాలో చోటుచేసుకుంది. రెజాగుల్ (20), ముహమ్మద్ ఖాన్(25) ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి చిన్న పాప ఉంది. అయితే ఏడేళ్ల బాలికను ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ఖాన్. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో ఖాన్, కత్తి తీసుకొని భార్య రెజా ముక్కు కోసేశాడు. అనంతరం ఖాన్ అతని సోదరుడు కలిపి ఆమెను బైక్ పై తీసుకొని వెళుతుండగా, బాధితురాలు అరుపులు విన్న స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ఇద్దరూ అక్కడినుంచి ఉడాయించారు. గాయపడిన బాధితురాల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
తీవ్ర రక్తస్రావంతో రెజా పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు తెలిపారు. తెగిపడిన ముక్కును శస్త్రచికిత్స చేసే సదుపాయం తమ తగ్గర లేదని తెలిపారు. దీనిపై స్పందించిన అప్ఘానిస్తాన్ ప్రభుత్వం రెజాను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. చికిత్స, ఆపరేషన్ నిమిత్తం ఆమెను టర్కీ తరలించేందుకు తగిన ఏర్పాటు చేస్తోంది.
అయితే ఉద్యోగం నిమిత్తం తరచూ ఇరాన్ వెళ్లే ఖాన్, తిరిగి వచ్చి భార్యను హింసించేవాడని రెజా తల్లి ఆరోపించింది. పెళైన దగ్గరినుంచీ తన కూతురికి నరకం చూపించాడని వాపోయింది. గొలుసులతో బంధించి, బూతులు తిడుతూ దారుణంగా ప్రవర్తించేవాడంది. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే తన బిడ్డను చంపేందుకు ప్రయత్నించాడని తెలిపింది. అతడు తనకు దొరికితే ముక్కలు ముక్కలు నరకుతానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు అప్ఘాన్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించడంతో భయపడిన భర్త.. తాలిబన్ల అధీనంలోనున్న ప్రాంతంలో తలదాచుకున్నట్టు సమాచారం. దీనిపై స్పందించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తాలిబన్ల అదుపులో వున్న నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. అటు రక్తమోడుతున్న బాధితురాలి ఫొటోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.