‘అభయ’ నిందితులకు జైలుశిక్ష
రంగారెడ్డి జిల్లా కోర్టులు: అభయ కేసులో నిందితులకు శిక్ష పడటంతో బాధితులకు ఊరట లభించింది. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన అభయ (22) (పేరు మార్చాం) గౌలిదొడ్డిలోని మహిళా హాస్టల్లో ఉం టూ హైటెక్‌సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోం ది. గతేడాది అక్టోబర్ 18న సాయంత్రం 5.30కి ముగించుకొని ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌కు వచ్చింది.
రాత్రి 7.30కి మాల్ నుంచి బయటికి వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా... ఆమె ఎదుట కారు (ఏపీ09 టీవీఏ-2762) ఆగింది. డ్రైవర్ వెడిచర్ల సతీష్ లిఫ్ట్ ఇస్తానని ఆమెను ఎక్కించుకున్నాడు. కారులో అతని స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లు ఉన్నాడు. ఇద్దరూ ఆమెను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కారులో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు నిందితులు సతీష్, వెంకటేశ్వర్లును అరెస్టు చేసి.. దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డి.నాగార్జున్ బుధవారం నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
అభయ కేసు నిర్భయ చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన తొలికేసు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేసి.. త్వరగా దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసులో 209 రోజుల్లోనే తీర్పు రావడాన్ని స్వాగతిస్తున్నా. త్వరగా నిందితులకు శిక్షపడటంతో అభయ ఘటనలు వంటివి పునరావృతం కావు. - నాగరాజు, అభయ కేసు వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
మహిళలపై దాడులకు పాల్పడే వారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చట్టాలను సరిగ్గా అమలు చేస్తే మహిళలపై దురాగతాలు తగ్గే అవకాశం ఉంది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారికి మరింత కఠిన శిక్షలు విధించాలి. - (పి.రమణి, న్యాయవాది)