కలవరపరిచేను!
వరి కోతల్లో జాప్యం
తుఫాన్‌తో తెగుళ్ల దాడి
భారీగా పెరిగిన సాగు వ్యయం
అన్నదాతల్లో ఆందోళన
విశాఖపట్నం : జిల్లాలో ఖరీఫ్ వరి కోతల్లో జాప్యం అన్నదాతలకు శాపంగా మారుతోంది. తుఫాన్ కారణంగా తెగుళ్లు ఒకవైపు.. కూలీల భారం మరోవైపు వీరిని కుంగదీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగువ్యయం తడిసిమోపెడు కావడం, ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కనీసం పెట్టుబడులైనా దక్కుతాయో లేదోననే భయాందోళన చెందుతున్నారు. జిల్లాలో సార్వాసాగుపై ఆది నుంచి జాప్యం జరుగుతూనే ఉంది. ఆ ప్రభావం ఇప్పుడు కోతలపై పడింది. ఇదికాస్తా దిగుబడుల పతనానికి దారితీస్తోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణంపై సందిగ్ధత కొనసాగింది. జిల్లాలో సాధారణ ఖరీఫ్ విస్తీర్ణం లక్షా 12 వేల హెక్టార్లు కా గా, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 96వేల హెక్టార్లలో మాత్రమే రైతులు వరిసాగు చేశారు. వాస్తవానికి ఖరీఫ్ కోతలు డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తయ్యేవి. జనవరిలో రబీసాగు ఆరంభమయ్యేది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కన్పిం చడం లేదు. హుద్‌హుద్ తుఫాన్‌కు జిల్లాలో 23,317 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. ఇక మిగిలిన 2,17,738 ఎకరాల్లో పంట ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉంది. సాధారణంగా ప్రతీయేటా ఆగస్టులో నాట్లు పడాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ వరకూ నాట్లుపడుతూనే ఉన్నాయి. ప్రతీయేటా నవంబర్ నెలాఖరు నాటికి 60శాతం కోతలు పూర్తయ్యేవి. కానీ ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారం పూర్తయినా కనీసం 15 శాతం కూడా కోతలు పూర్తికాని పరిస్థితి నెలకొంది.
గతేడాది ఇదే సమయానికి 45 శాతం కోతలు పూర్తయ్యాయి. ఈ ప్రభావం రానున్న రబీసాగుపై పడే అవకాశాలున్నాయి. కోతల్లో చోటుచేసుకున్న జాప్యం రైతులకు పెనుభారంగా మారింది. ఇప్పటికే రోజుకు రూ.350 పెడితే కానీ కూలీ దొరకని పరిస్థితి నెలకొంది. ఈ భారానికితోడు ఇటీవల విలయం సృష్టించిన హుద్‌హుద్ తుఫాన్‌తో పాటు వచ్చిన తెగుళ్లు రైతులను దిక్కుతోచని స్థితిలో పడేశాయి. మామూలుగా ఉపయోగించే పురుగుల మందుల కంటే ప్రస్తుతం ఈ తెగుళ్ల నివారణ కోసం మరో 20 శాతం అదనం మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికే ఎకరాకు రూ.2500ల నుంచి రూ.3వేల వరకు ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు. ఇలా ఖరీఫ్ సాగులో జరిగిన జాప్యం వల్ల ఎకరాకు విత్తనాలకు రూ.1500లు, ఎరువులు, పురుగుల మందులకు రూ.7500లు, కూలీలకు ఏకంగా రూ.10వేల వరకు ఖర్చవుతుందని చెపుతున్నారు. దీంతో ఎకరాకు రూ.19వేలకు పైగా పెట్టుబడి అవుతుంటే వచ్చే ఆదాయం మాత్రం అరకొరగానే ఉంటోందని వాపోతున్నారు. తుఫాన్ ప్రభావంతో దిగుబడి గణనీయంగా తగ్గే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఎకరాకు 20 నుంచి 25బస్తాల వరకు దిగుబడి ఉండేది .కానీ ప్రస్తుతం ఎకరాకు కనీసం 15-17బస్తాలకు మించి రావడం లేదని రైతులు వాపోతున్నారు. 75 కేజీల బస్తాకు మద్దతు ధర రూ.1380 ఇస్తున్నారు. అదే మిల్లర్లయితే క్వింటాల్‌కు రూ.1400 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన చూసినా ఎకరాకు రూ.20వేల నుంచి రూ.22వేలకు మించి వచ్చే పరిస్థితి లేదు.
పెట్టుబడే ఏకంగా రూ.19వేలవుతుంటే ఇక కష్టానికి ప్రతిఫలమేమిటో అర్ధం కావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. కాస్తపంట బాగున్నవారి పరిస్థితి ఇలా ఉంటే.. పంట చాలా వరకు దెబ్బతిన్న వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. కనీసం పెట్టుబడి కూడా వస్తుందో లేదో కూడా తెలియని ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ నెలాఖరు కాదు కదా కనీసం సంక్రాంతికి కూడా కోతలు పూర్తయ్యే పరిస్థితి కన్పించడం లేదంటున్నారు. దీంతో రబీసాగు ప్రశ్నార్ధకంగా తయారైంది
వ్యవసాయం అంటేనే భయమేత్తంది
వ్యవసాయం అంటేనే భయమేత్తంది. మూడేళ్లుగా అన్నీ నట్టాలే వత్తున్నాయి. నేను ఈ ఏడు ఎకరా భూమిలో వరి వేశాను. పెట్టుబడి సుమారు రూ.20 వేలు వరకు అయిపోయింది. విత్తనాలు, పురుగుల మందులు ఇలా చాలా మదుపు పెట్టేసినాం. మొదట్లో వర్షాలు కురవక పంటలో ఎదుగుదల లోపించింది. ఆ తర్వాత పంట పొట్టమీద ఉండగా తుఫాన్ ఉన్నకాడికి నాశనం చేసేసింది. ఈదురు గాలులకు చేను మొత్తం పడిపోయింది. తెగుళ్లు వచ్చి చాలా వరకు పంట దెబ్బతింది. పెట్టిన పెట్టుబడి వచ్చేలా లేదు. మామూలుగా ఎకరాకు 25 కాటాలు బియ్యం అవుతాయి. ఇప్పుడేమో 15 కాటాలే అయ్యేటట్టు ఉన్నాయి. అప్పు మిగిలుతుంది.
- వరహాలబాబు, నీలిగుంట. కోటవురట్ల మండలం
దిగుబడి కష్టమే
మాది వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం. దాదాపు ఎకరం పొలంలో వరి పంట వేశాను. దుక్కులు, కూలీలు, ఎరువులు, విత్తనాలు అన్నీ కలిపి దాదాపు రూ.15 వేల పైబడి ఖర్చయింది. ఈ ఏడాది తొలినాళ్లలో వర్షాభావం, తరువాత తుఫాను కారణంగా చేను తీవ్రంగా దెబ్బతింది. తుఫాను అనంతరం నీరు సకాలంలో అందకపోవడంతో మిగిలిన పంట సరిగా పండలేదు. ఈ ఏడాది దిగుబడి ఆశించినంత ఉండదు. పంటల బీమాకు అర్హతలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఎంటో అర్థం కావడం లేదు.
- గండి దేముడు, రైతు, సబ్బవరం