రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు
ఉండూరు (సామర్లకోట) :
ఎంఎస్ పాయింట్ నుంచి రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యాన్ని రైసు మిల్లుకు తరలించడంతో విజిలెన్స్ ఎస్పీ టి.రామప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు. విజిలెన్స్ ఎస్పీ కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి ఏడీబీ రోడ్డులోని ఉండూరుకు చెందిన తేజ రైస్ మిల్లుకు రేషన్ బియ్యం చేరింది. పెద్దాపురం మండలం దివిలిలో ఉన్న గోదాముల నుంచి సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామంలోని మూడు రేషన్ షాపులకు ఈ బియ్యం చేరాలి. విజిలెన్స్ అధికారులు దాడి చేసే సమయంలో ట్రాక్టర్లో 198 బస్తాలు ఉండాలి. అప్పటికే మిల్లులోకి 34 బస్తాలు దింపారు. జిల్లాలోనే తొలిసారిగా ఎంఎస్ పాయింట్ నుంచి మిల్లుకు బియ్యం చేరిన సంఘటన ఇది. మిల్లులో దింపిన బియ్యం బస్తాలు రేషన్ బియ్యం సంచులతో ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎంఎస్ పాయింట్ సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారులు, రేషన్ డీలర్ల పాత్ర ఉంటుందని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులు.. ట్రాక్టర్ డ్రైవర్, వీఆర్ఏ, మిల్లు యజమానుల నుంచి సమాచారం సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ డీఎస్పీ పి.రాజేంద్రకుమార్, సీఐలు గౌస్బేగ్, రామ్మోహన్రెడ్డి, సీటీఓ రత్నకుమార్, విజిలెన్స్ తహసీల్దార్ గోపాలరావు, డిప్యుటీ తహసీల్దార్ తాతారావు తదితరులు పాల్గొన్నారు.