Rice transport
-
కాకినాడ రేవు ప్రతిష్టను దెబ్బతీయొద్దు
కాకినాడ: బియ్యం ఎగుమతుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న కాకినాడ రేవు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని కోరుతూ పోర్టు ఆధారిత వర్గాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శనివారం లేఖ రాశాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్సీపీ సహా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎటువంటి మచ్చా లేకుండా పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్, ఆలిండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్, బార్జి ఓనర్స్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం మీడియాతో మాట్లాడారు. కాకినాడ రేవు నుంచి ఆఫ్రికాతో పాటు ఇతర దేశాలకు కూడా బియ్యం రవాణా అవుతున్నాయన్నారు. ఇక్కడి నుంచి వెళ్లే బియ్యమంతా ఆంధ్రప్రదేశ్‌లో పండించినదేనన్న అపోహలతో పాటు, అనేక అంశాలకు ముడిపెడుతూ వస్తున్న కథనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. వాస్తవానికి 60 నుంచి 70 శాతం బియ్యం పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి, కాకినాడ నుంచి ఎగుమతి అవుతోందన్న వాస్తవాన్ని గుర్తించాలని వారు కోరారు. రాజకీయ పరమైన వివాదాలకు కాకినాడ రేవును కేంద్రంగా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అక్రమాలకు ఆస్కారం లేదు కస్టమ్స్ వంటి ఎన్నో కేంద్ర శాఖల పర్యవేక్షణలో ఇక్కడి కార్యకలాపాలు జరుగుతుంటాయని, రేవులో అక్రమాలకు ఎటువంటి ఆస్కారమూ ఉండదని ఆ ప్రతినిధులు స్పష్టంచేశారు. ఇక్కడి నుంచి బాయిల్డ్, రా, బ్రోకెన్ రైస్‌తో పాటు బొగ్గు, జొన్న వంటి మరెన్నో ఎగుమతులు కూడా నిరంతరాయంగా సాగుతున్నాయన్నారు. టీడీపీ నేత పట్టాభి తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయా పోర్టు ఆధారిత వర్గాలు వేర్వేరుగా మాజీ సీఎం చంద్రబాబునుద్దేశించి ఈ లేఖలు రాశాయి. సమావేశంలో కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వారణాసి రాఘవులు (రఘు), ఆలిండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీవీ కృష్ణారావు, కార్యదర్శి వినోద్ అగర్వాల్, ఉపాధ్యక్షుడు చిట్నీడి శ్రీనివాస్, కోశాధికారి కె. భాస్కరరెడ్డి, బార్జి ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బంధన హరి, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ఎస్ రాజు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం బియ్యం పట్టివేత
కరకుదురు (పెదపూడి): గ్రామంలోని సూర్యతేజ రైసు మిల్లులోకి అక్రమంగా తరలించిన మధ్యాహ్న భోజనం బియ్యం బుధవారం రాత్రి పట్టుకున్నామని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి పి.ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కాకినాడలోని పరిసర ప్రాంతాల్లో గల 87 పాఠశాలలకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా మధ్యాహ్న భోజనం తయారు చేసి అందిస్తుంటారు. ఆ ఫౌండేషన్‌కు చెందిన ట్రాక్టర్ ద్వారా సుమారు వంద క్వింటాళ్ల బియ్యం( 200 బియ్యం బస్తాలు) గ్రామంలోని రైసుమిల్లులోకి అక్రమంగా తరలిస్తున్నారంటూ తమకు సమాచారం అందిందన్నారు. తమకు వచ్చిన సమాచారంపై దాడులు చేపట్టగా ట్రాక్టర్, బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. బియ్యాన్ని ట్రాక్టర్ని సీజ్ చేసి తమ శాఖ గోడౌన్‌కు పంపించామన్నారు. అలాగే ఈ రైసు మిల్లుకి ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 15,062 క్వింటాళ్ల ధాన్యాన్ని తమశాఖ ద్వారా ఇచ్చామన్నారు. దానికి సంబంధించి సుమారు 10, 918 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా, సుమారు 9,420 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారన్నారు. ఇంకా 670 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉందన్నారు. దీనిపై మిగిలిన బియ్యం ఉన్నాయా? లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. శుభ్రం చేయడానికి ఇక్కడికి తెచ్చాం బియ్యంలో రాళ్లు తీయించి శుభ్రం చేయడానికి ఇక్కడికి తెచ్చామని అక్షయ పాత్ర పౌండేషన్ డిస్ట్రిబ్యూటర్ కె.చంద్రశేఖర్ జిల్లా సివిల్ సప్లయ్ అధికారి ప్రసాద్‌కు తెలిపారు. దీనిపై ప్రసాద్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పథకం బియ్యం రాళ్లు తీయించడానికి, శుభ్రం చేయడానికి జిల్లా ఉన్నతాధికారుల అనుమతి ఉండాలని అలాంటి అనుమతి ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. దీంతో చంద్రశేఖర్ ఎలాంటి అనుమతి లేదంటూ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ అక్రమంగా బియ్యం కొనుగోలు చేసే రైసుమిల్లులు, తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామాని హెచ్చరించారు. -
నల్లబజారుకు రేషన్‌బియ్యం
రేషన్‌బియ్యం మాఫియా పెచ్చరిల్లుతోంది. అందినంత చౌకబియ్యాన్ని రూటు మార్చి, బియ్యం రూపు మార్చి నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకుంటోంది. అధికార పార్టీ నేతల అండదండలతో అధికారుల హెచ్చరికలను పెడచెవినపెట్టి తమ దందా కొనసాగిస్తోంది. నరసరావుపేటటౌన్: అధికారులు ఓవైపు హెచ్చరిస్తున్నా రేషన్ మాఫియా ఆగడాలను ఆపడం లేదు. పేదలకు పంచాల్సిన బియ్యాన్ని యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ ఆలస్యంగా మేల్కొన్న అధికార యంత్రాంగం అక్రమ బియ్యం రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అక్రమార్కులకు అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతినెలా వేల క్వింటాళ్ల కొద్దీ ప్రజాపంపిణీ బియ్యాన్ని మాఫియా రూటుమార్చి...రూపుమార్చి పక్కదారి పట్టిస్తూనే ఉంది. వివరాల్లో కెళితే...డివిజన్ కేంద్రమైన నరసరావుపేట మండల పరిధిలో ఉన్న 115 చౌకదుకాణాల ద్వారా 49వేల మంది కార్డుదారులకు 757మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా పంపిణీ చేయాల్సి ఉంది. అందులో కార్డుదారులకు నామమాత్రంగా పంపిణీ చేసి మిగిలిన బియ్యాన్ని డీలర్లు నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. ఈతంతు ఒక్క నరసరావుపేటలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. తెలుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు ఉన్న రేషన్ డీలర్లను అకారణంగా తొలగించి వారి స్థానాల్లో పార్టీ ద్వితియశ్రేణి నాయకులను నియమించారు. దీంతో రేషన్ అక్రమాలపై అనేక ఫిర్యాదులు వచ్చినా పౌరసరఫరాల, రెవెన్యూ శాఖల అధికారులు రేషన్‌షాపుల వైపు నామమాత్రపు తనిఖీలు కూడా చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది డీలర్లు ప్రతినెలా కార్డుదారుల నుంచి వేలిముద్రలు వేయించుకొని బియ్యం ఇవ్వకుండా నగదు ఇస్తున్నారు. బియ్యం పంపిణీ చేయాలని కోరినప్పటికీ వచ్చేనెల తీసుకోండి అంటూ ప్రతినెలా అదేమాట చెప్పి రేషన్ బియ్యాన్ని భోంచేస్తున్నారు. పర్యవేక్షణ లేమి... ప్రతినెలా కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌకదుకాణాలకు వేలాది క్వింటాళ్ల బియ్యం దిగుమతి అవుతుంది. గతంలో రూట్ అ«ధికారైన ఆర్ఐ పర్యవేక్షణలో బియ్యం దిగుమతి జరిగేది. ప్రజాపంపిణీ బియ్యం రవాణా వాహనానికి జీపీఆర్ఎస్ సిస్టం అమర్చడంతో రూట్ అధికారులను తొలగించారు. దీంతో రేషన్ షాపుల వద్ద బియ్యం దిగుమతి సమయంలోనే అక్రమార్కులు సంచులు మార్చి నల్లబజారుకు తరలిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. దీంతోపాటు ప్రజాపంపిణీ సక్రమంగా జరుగుతుందా లే దా అనే అంశాన్ని అధికారులు విస్మరించారు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించకపోవడంతో గంటల కొద్ది వేచిఉన్న కార్డుదారులు అసహనంతో వెనుదిరిగి పోవడం పరిపాటిగా మారింది. రేషన్‌సరుకుల కోసం కాళ్ళరిగేలా తిరగలేక డీలరిచ్చినంత పుచ్చుకుంటున్నారు కార్డు దారులు. ఇలా సేకరించిన బియ్యాన్ని సంచులు మార్చి బియ్యం మాఫియా రాష్ట్రాలను దాటిస్తుంది. ప్రతినెలా డీలర్ల నుంచి రెవెన్యూ, పోలీస్‌శాఖ మామూళ్ళు తీసుకుంటూ నిద్రావస్థలో నటిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాజిక బృందం తనిఖీతో వెలుగు చూసిన అక్రమాలు... సామాజిక తనిఖి బృందం గతేడాది అక్టోబర్ నెలలో నకరికల్లు, రొంపిచర్ల, ఈపూరు మండలాల్లోని చౌకదుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. 107చౌకదుకాణాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా ఇటీవల ఆర్డీవో గంధం రవీందర్ 87రేషన్ డీలర్లను తొలగించారు. బియ్యం అక్రమ రవాణాను నివారించేందుకు పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులను కలిపి జేఏసీగా ఏర్పాటు చేశారు. దీంతోపాటుగా బియ్యం అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి పర్యవేక్షణకు ఏఎస్‌వోను అధికారిగా నియమించారు. మొదటివిడత నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గంలో పలు మండలాలను పైలెట్ మండలాలుగా గుర్తించారు. జేఏసీ బృందం ప్రతిరోజు చౌకదుకాణాలను తనిఖీ చేసి అక్రమాలకు పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. అక్రమ రవాణాను జేఏసీ అరికట్టేనా? ఆర్డీఓ గంధం రవీందర్ బియ్యం అక్రమ రవాణాపై జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేసిన రెండో రోజే రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెంలోని ఓ చౌకదుకాణంలో 41క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యం దుర్వినియోగం అయింది. దీంతోపాటు గత 20రోజుల క్రితం ప్రకాష్‌నగర్, సత్తెనపల్లి రోడ్డు రెండు ప్రాంతాల్లో రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారి అధికారపార్టీ కౌన్సిలర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఏంజల్ టాకీస్ ప్రాంతంలోని ఓ చౌకదుకాణ డీలరు రేషన్ బియ్యాన్ని రాత్రిపూట అక్రమంగా తరలిస్తున్నాడు. సమాచారం అందుకుని పోలీసులు అక్కడికి చేరుకునే సరికి బియ్యంలోడు ఆటో వెళ్ళిపోయింది. అధికారులు హెచ్చరిస్తున్నా...నివారణకు చర్యలు చేపడుతున్నా...బియ్యం మాఫియా మాత్రం తన ఆగడాలను ఆపడం లేదు. ఉన్నతస్థాయి అధికారులు దృష్టిసారిస్తే గానీ బియ్యం మాఫియా నియంత్రణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. -
ఏడుగురిపై క్రిమినల్ కేసులు
సామర్లకోట : ఎంఎస్ పాయింట్ నుంచి రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యాన్ని రైసు మిల్లుకు తరలించిన సంఘటనలో విజిలెన్స్ అధికారుల ఆదేశాల మేరకు కాకినాడ తిమ్మాపురం పోలీసులు ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రైసుమిల్లు యజమాని బత్పల శ్రీవిష్ణు సూర్యతిరుపతిరావు, ఇద్దరు ట్రాక్టరు డ్రైవర్లు కేశమూరి సత్తిబాబు, గుండా బత్తుల రాఘవ, రూట్ సిబ్బంది (వీఆర్ఏ) పలివెల అబ్బు, గోదాముల గుమస్తా కేతా సాయిరామకృష్ణ, రవాణా కాంట్రాక్టర్ అడ్డూరి సత్యనారాయణ, కాంట్రాక్టరు గుమాస్తా కొటికెలపూడి శ్రీరామచంద్రమూర్తిపై సివిల్ సప్లయీస్ ఏఎస్ఓ పీతల సురేష్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్టు ఎస్సై జీవీవీ సత్యనారాయణ తెలిపారు. కాగా ఈ సంఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఎల్.శివకుమార్ తెలిపారు. వీఆర్ఏను విచారణ చేసి, దీని వెనుక ఉన్న వారిని గుర్తిస్తామని చెప్పారు. -
రెండు లారీల బియ్యం పట్టివేత
పంగులూరు, న్యూస్‌లైన్ : రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని రేణింగవరం పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. ఎస్సై ఎన్.రాఘవరావు తెలిపిన వివరాల ప్రకారం... పంగులూరు మండలం చందవరం గ్రామం వద్ద సిబ్బందితో కలిసి ఎస్సై రాఘవరావు పెట్రోలింగ్ నిర్వహిస్తూ అటుగా వెళ్తున్న రెండు లారీలను తనిఖీ చేశారు. ఆ రెండు లారీల్లో బియ్యం ఉండటంతో అనుమానం వచ్చి అనుమతి పత్రాలు అడిగారు. వారివద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పాటు అవి రేషన్ బియ్యంగా తేలడంతో లారీలతో సహా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అద్దంకిలోని సివిల్ సప్లయిస్ గోడౌన్‌కు బియ్యాన్ని తరలించారు. రెండు లారీల్లో 360 బస్తాల (18 టన్నులు) రేషన్‌బియ్యం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. టంగుటూరు మండలం మల్లవరప్పాడు నుంచి ఆ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు తహసీల్దార్ ప్రశాంతి,ఎన్ఫోర్స్మెంట్ డీటీ లింగారావు విచారణ చేపట్టారు. రేపల్లె సమీపంలో లారీ బియ్యం... రేపల్లె (గుంటూరు), న్యూస్‌లైన్ : రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఉదయం గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దార్ వి.శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డికి అందిన సమాచారంతో పెనుమూడి చెక్‌పోస్టువద్ద రేషన్‌బియ్యాన్ని తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకున్నారు. చీరాల పట్టణ పేరాలలోని శ్రీసీతారామాంజనేయ రైస్‌మిల్లు నుంచి రాజమండ్రికి ఆ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఆ మేరకు పెనుమూడి-పులిగడ్డ వారధి చెక్‌పోస్టు వద్ద నిఘా ఏర్పాటు చేసి 200 బస్తాల్లో (50 కేజీల బస్తాలు) ఉన్న 100 క్వింటాళ్ల బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న మరో వ్యక్తి నండూరి శ్రీనివాసరావు పరారయ్యాడు. రేషన్ బియ్యం తరలిస్తున్న పేరాలలోని శ్రీసీతారామాంజనేయ రైస్‌మిల్లుపై ఒంగోలు విజిలెన్స్అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి సీజ్‌చేసి 6ఏ కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తర లిస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఈ దాడుల్లో రేపల్లె పట్టణ సీఐ యూ నాగరాజు, ఎస్సై అవ్వారు వెంకటబ్రహ్మం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై ఖాశీంసైదా, కానిస్టేబుల్ సత్యసాయి, వీఆర్వోలు సర్దార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
రచ్చబండకు సమైక్య సెగ
రచ్చబండకు హాజరవుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సమైక్య సెగ తప్పడం లేదు. మంత్రి గల్లా అరుణకుమారికి శనివారం ఇదే అనుభవం ఎదురైంది. సమైక్య గళం వినిపించేందుకు యత్నించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య మొక్కుబడిగా సభలు జరిగాయనిపించారు. సాక్షి, చిత్తూరు: తిరుపతి రూరల్ మండలం రచ్చబండ సభ తిరుచానూరు శిల్పారామం వద్ద శనివారం నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం ముందే గ్రహించిన పోలీసులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మరికొందరు వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రజా సమస్యలపై అర్జీ ఇచ్చేందుకు వెళుతుంటే తమ కార్యకర్తలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారని చెవిరెడ్డి విమర్శించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ శివప్రసాద్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ తదితర పథకాలు పంపిణీ చేశారు. ప్రజా సమస్యల ప్రస్తావన లేకుండానే రచ్చబండ సభ ముగించేశారు. సభ కాంగ్రెస్ సమావేశంలా సాగుతోందని, గత రచ్చబండలో ఇచ్చిన అర్జీలు ఏమయ్యాయని సభలో సీపీఎం నాయకులు అధికారులను నిలదీశారు. రామచంద్రాపురంలోనూ ఇదే రీతిలో మొక్కుబడిగా రచ్చబండ సభ నిర్వహించారు. ఇక్కడ బంగారుతల్లి ప్రస్తావన లేకుండానే మంత్రి ఉపన్యసించి లబ్ధిదారులకు ఆస్తులు పంచారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రచ్చబండ నిర్వహించారు. చంద్రగిరిలో మంత్రిని అడ్డుకుని సమైక్యాంధ్ర నినాదాలు చేసేందుకు సిద్ధమైన పదిమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంద్రగిరి పోలీసులు రచ్చబండ జరగక ముందే అదుపులోకి తీసుకున్నారు. మంత్రి గల్లా అరుణ ఉపన్యసించి అర్జీలు తీసుకున్నారు. ఇక్కడా ప్రజలకు సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం కల్పించలేదు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. అన్ని రచ్చబండ సభల్లో అర్జీలు తీసుకోవడం మినహా ప్రజలకు సమస్యలపై మా ట్లాడే అవకాశం అధికారులు ఇవ్వలేదు. కాంగ్రెస్‌కు ఇదే చివరి రచ్చబండ గ్రామ రచ్చబండలో జరగాల్సిన రచ్చబండను కల్యాణమండపాల్లో నిర్వహించడం సిగ్గుచేటు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాల్సిన అధికారులు ప్రజలనే తమవద్దకు రప్పించుకోవడం బాధా కరం. ప్రజాధనంతో నిర్వహించిన సభకు కాంగ్రెస్‌పార్టీ నాయకులను మాత్రమే అనుమతించడం అన్యాయం. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు గోరీకట్టడం ఖాయం. పోలీసులు చేతిలో ఉన్నారని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం మంచిదికాదు. అధికార పార్టీకి ఇదే చివరి రచ్చబండ. వచ్చే రచ్చబండ జగనన్న సారధ్యంలో వైఎస్ ఆశయాలతో జరుగుతుంది. - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త