ట్రాక్టర్‌పై ఉన్న బియ్యాన్ని పరిశీలిస్తున్న డీఎస్‌ఓ ప్రసాద్ తదితరులు
కరకుదురు (పెదపూడి): గ్రామంలోని సూర్యతేజ రైసు మిల్లులోకి అక్రమంగా తరలించిన మధ్యాహ్న భోజనం బియ్యం బుధవారం రాత్రి పట్టుకున్నామని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి పి.ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కాకినాడలోని పరిసర ప్రాంతాల్లో గల 87 పాఠశాలలకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా మధ్యాహ్న భోజనం తయారు చేసి అందిస్తుంటారు. ఆ ఫౌండేషన్‌కు చెందిన ట్రాక్టర్ ద్వారా సుమారు వంద క్వింటాళ్ల బియ్యం( 200 బియ్యం బస్తాలు) గ్రామంలోని రైసుమిల్లులోకి అక్రమంగా తరలిస్తున్నారంటూ తమకు సమాచారం అందిందన్నారు. తమకు వచ్చిన సమాచారంపై దాడులు చేపట్టగా ట్రాక్టర్, బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. బియ్యాన్ని ట్రాక్టర్‌ని సీజ్ చేసి తమ శాఖ గోడౌన్‌కు పంపించామన్నారు. అలాగే ఈ రైసు మిల్లుకి ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 15,062 క్వింటాళ్ల ధాన్యాన్ని తమశాఖ ద్వారా ఇచ్చామన్నారు. దానికి సంబంధించి సుమారు 10, 918 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా, సుమారు 9,420 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారన్నారు. ఇంకా 670 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉందన్నారు. దీనిపై మిగిలిన బియ్యం ఉన్నాయా? లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
శుభ్రం చేయడానికి ఇక్కడికి తెచ్చాం
బియ్యంలో రాళ్లు తీయించి శుభ్రం చేయడానికి ఇక్కడికి తెచ్చామని అక్షయ పాత్ర పౌండేషన్ డిస్ట్రిబ్యూటర్ కె.చంద్రశేఖర్ జిల్లా సివిల్ సప్లయ్ అధికారి ప్రసాద్‌కు తెలిపారు. దీనిపై ప్రసాద్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పథకం బియ్యం రాళ్లు తీయించడానికి, శుభ్రం చేయడానికి జిల్లా ఉన్నతాధికారుల అనుమతి ఉండాలని అలాంటి అనుమతి ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. దీంతో చంద్రశేఖర్ ఎలాంటి అనుమతి లేదంటూ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ అక్రమంగా బియ్యం కొనుగోలు చేసే రైసుమిల్లులు, తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామాని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment