కేన్సర్ కణాలపై అణువుల సుత్తి!
కేన్సర్... పేరు చెప్పగానే మరణం ఖాయమన్న ఆలోచనలు అందరిలోనూ మెదులుతాయి. అయితే అత్యాధునిక టెక్నాలజీ, పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు కేన్సర్ వ్యాధి నిర్వహణ ఎంతో సులువైంది. కాకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య పద్ధతులు మూడింటితోనూ బోలెడన్ని సమస్యలు, దుష్ప్రభావాలైతే ఉన్నాయి. అందుకే అతితక్కువ దుష్ప్రభావాలున్న చికిత్స పద్ధతి కోసం శాస్త్రవేత్తలు చాలా చోట్ల పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా రైస్ యూనివర్శిటీ Rice University శాస్త్రవేత్తలు విజయం సాధించారు కూడా. ప్రత్యేకమైన కాంతి, కొన్ని అణువుల సాయంతో 99 శాతం కేన్సర్ కణాలను చంపేయవచ్చునని వీరు నిరూపించారు.
ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ప్రధానంగా మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు.
► శస్త్రచికిత్స
కణితిని తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స(సర్జరీ)
ఇది శరీరాన్ని బలహీన పరిచే ప్రక్రియ.
►ఇక రెండోది కీమో థెరపీ
ఇందులో రేడియోధార్మిక రసాయనాల సాయంతో శరీరంలోని కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు.
జుట్టు ఊడిపోవడం, వాంతులు, విరేచనాలు, అలవిగాని అలసట.. ఇలా రకరకాల దుష్ప్రభావాలు తప్పవు.
► మూడో పద్ధతి.. రేడియో థెరపీ
రేడియో ధార్మిక పదార్థాలతో నేరుగా కణితులను నాశనం చేసేందుకు వాడే పద్ధతి ఇది
కీమోథెరపీతో వచ్చే ఇబ్బందులే ఇక్కడ కూడా కనిపిస్తాయి
ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రిసిషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ వంటివి మునుపటి పద్ధతుల కంటే కొంత మెరుగ్గా ఉన్నా... శాస్త్రవేత్తలు వీటిపై మరింత పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది.
కొత్తగా ఏం చేశారంటే..
చాలా సింపుల్. అమైనో సయనైన్ అణువులు కొన్నింటిని తీసుకున్నారు. పరారుణ కాంతి కిరణాల ద్వారా వాటిని ఉత్తేజపరిచారు. ఫలితంగా ఈ అణువులు కంపించడం మొదలుపెట్టాయి. ఇలా కంపిస్తున్న అణువులను దగ్గరగా ఉంచడం ద్వారా కేన్సర్ కణాల పైపొరలు విచ్ఛిన్నమై నాశనమయ్యేలా చేశారు. అంతే!!
ఈ అమైనో సయనైన్ అణువులను శరీరం లోపలి అవయవాల ఫొటోలు తీసేందుకు ఒక రకమైన రంగు మాదిరిగా ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పరారుణ కాంతి పడినప్పుడు వీటిల్లోని అణువులు ఉత్తేజితమై ప్లాస్మాన్లుగా మారుతున్నాయి. అణువు లోపలే కంపిస్తూ ఉంటాయి. ఈ కంపనాలు కాస్తా కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేందుకు కారణమవుతున్నాయి. పరారుణ కాంతి వినియోగానికీ ప్రాముఖ్యత ఉంది. ఈ కాంతి శరీరం లోపలికి దృశ్యకాంతి కంటే లోతుగా చొచ్చుకుపోగలదు. శరీరం లోపలి అవయవాలు మాత్రమే కాకుండా.. ఎముకలకు వచ్చే కేన్సర్లకు కూడా ఈ కాంతి ద్వారా చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నమాట.
ఈ పద్ధతి పనితీరుపై రైస్ యూనివర్శిటీ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ మాట్లాడుతూ.. కంపనాలన్నీ క్రమ పద్ధతిలో ఒకేలా ఉండేలా చేయడం వల్ల కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. ‘‘నిజానికి ఈ పద్ధతిని కేన్సర్‌పై అణువుల సుత్తి దెబ్బ’’ అనాలి అంటారు ఆయన.
ఎలుకల్లో కేన్సర్ మాయం..
రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గాజు పాత్రలో కేన్సర్ కణాలను ఉంచి అమైనో సైనైన్ అణువులను ప్రయోగించారు. ఆశ్చర్యకరమైన రీతిలో 99 శాతం వరకూ కేన్సర్ కణాలు నశించిపోయాయి. మెలనోమా కేన్సర్ కణితులున్న ఎలుకలపై వాడినప్పుడు కూడా కొంత కాలం తరువాత దాదాపు సగం ఎలుకల్లో కేన్సర్ కణాలన్నవి లేకుండా పోయాయి. ఈ పరిశోధనల్లో రైస్ యూనివర్శిటీతోపాటు టెక్సస్ ఏ అండ్ ఎం, యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్‌లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే... నేడో రేపో.. ప్రాణాంతక కేన్సర్‌ను ఎలాంటి దుష్ప్రభావాలు, శస్త్రచికిత్సల అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చునన్నమాట!!!