'నా భార్యను విడిచిపెట్టండి'
నెల రోజుల క్రితం వారిద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. రెండు వారాల ఎడబాటు తర్వాత కలుసుకోబోతున్నందుకు ఆ దంపతులు ఎంతో సంతోషించారు. కానీ వారిద్దరూ కలుసుకోలేకపోయారు. భర్తను కలుసుకునేందుకు బయలు దేరిన భార్యను మధ్యలోనే అరెస్ట్ చేయడంతో వీరి కథ కొత్త మలుపు తిరిగింది. భార్య విడుదల కోసం భర్త ప్రయత్నాలు మొదలు పెట్టాడు. మీడియా ద్వారా తన ఆవేదనను వెల్లడించాడు.
బ్రిటన్ కు చెందిన రిచర్డ్ రాట్ క్లిఫ్, నజానిన్ జఘారి దంపతులు. వీరికి 22 నెలల గాబ్రియల్ అనే కూతురు ఉంది. సెలవుల్లో తన కూతురితో కలిసి నజానిన్ తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఇరాన్ కు వెళ్లింది. ఏప్రిల్ 2న ఆమె తన భర్తతో ఫోన్ లో మాట్లాడింది. తర్వాతి రోజు బ్రిటన్ కు బయలు దేరేందుకు టెహ్రాన్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడ ఆమెను అరెస్ట్ చేసి ఒంటరిగా బంధించారని రిచర్డ్ ఆరోపించాడు. కూతురు, లాయర్ ను కలవకుండా గుర్తు తెలియని జైలులో ఆమెను నిర్బంధించారని వాపోయాడు. అరెస్ట్ చేసినప్పటి నుంచి తనతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని తెలిపాడు.
ద్వంద్వ పౌరసత్వం కలిగిన తన భార్యను ఎందుకు అరెస్ట్ చేశారో ఇరాన్ అధికారులు వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నజానిన్ అరెస్ట్ గురించి తమకేం తెలియదని ఇరాన్ విదేశాంగ చెబుతోందన్నాడు. లండన్ లోని ఇరాన్ ఎంబసీ కూడా స్పందించడం లేదని వాపోయాడు. 41 ఏళ్ల రిచర్డ్ ఉత్తర లండన్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. నజానిన్(37) థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ గా పనిచేస్తోంది. అయితే ఇరాన్ లో ఆమెకు ఎటువంటి ప్రొఫెనల్ డీలింగ్ లేవని థామ్సన్ సంస్థ స్పష్టం చేసింది. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో రిచర్డ్ మీడియాకు ఎక్కాడు. సీఎన్ఎన్ వార్తా సంస్థతో తన గోడు వెళ్లబోసుకున్నాడు.