భవిష్యత్తు క్లౌడ్ కంప్యూటింగ్‌దే!
♦ ఐటీ, సేవల రంగంతో పాటు ఇప్పుడు వైద్యానికి క్లౌడే
♦ పేషెంట్ మెడికల్ ఇమేజెస్, నివేదిక విశ్లేషణ అన్నీ దీంతోనే
♦ ‘పికాసో’తో సగానికి సగం తగ్గనున్న వ్యయం, సమయం
♦ ‘సాక్షి’తో రికో ఎండీ మనోజ్ కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పైరసీ అంటే టక్కున గుర్తొచ్చేది సినిమాలే. కానీ, ఇప్పుడీ భయం సాఫ్ట్వేర్ కంపెనీలకూ పట్టుకుంది. ఉదయం విడుదలైన సినిమాలు సాయంత్రానికల్లా పైరసీ రూపంలో బయటికొచ్చేస్తే ఎలాగైతే నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టమొస్తుందో.. అంతకు రెట్టింపు నష్టం సాఫ్ట్వేర్ ఆప్లికేషన్ల పైరసీతోనూ కలుగుతోందంటున్నారు రికో ఇండియా ఎండీ మనోజ్ కుమార్. గతేడాది దేశంలో సాఫ్ట్వేర్ పైరసీల నష్టం విలువ రూ.3.5-4 బిలియన్ డాలర్లుంటుందని అంచనా వేశారాయన.
అయితే క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో సాఫ్ట్వేర్ పైరసీని పూర్తిగా అడ్డుకోవచ్చని చెప్పారాయన. ‘‘క్లౌడ్ కంప్యూటింగ్ మున్ముందు ఐటీ, సేవల రంగానికే కాక విద్యా, వైద్యం, సినిమా, ఇండస్ట్రీ.. ఇలా పలు రంగాలకూ విస్తరిస్తుంది’’ అన్నారాయన. పికాసో పేరిట దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ ఎనేబుల్డ్ మెడికల్ ఇమేజింగ్ సొల్యూషన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు.
- క్లౌండ్ కంప్యూటింగ్ విధానం అటు కంపెనీలకు, ఇటు వినియోగదారులకు ఇద్దరికీ లాభమే. ఇప్పటివరకు ఒక సాఫ్ట్‌వేర్‌ను కొనాలంటే వేలు, లక్షల్లో చెల్లించాలి. అలా కొన్న సాఫ్ట్వేర్లు కొన్ని కంప్యూటర్లకే పరిమితమయ్యేవి. ఎక్కువ కంప్యూటర్లకు వాడాలంటే మళ్లీ కొనాల్సి వచ్చేది. దీంతో సాఫ్ట్వేర్ అప్లికేషన్లు పైరసీకి గురయ్యేవి. ఇప్పటికీ పైరసీ సాఫ్ట్వేర్లు ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉన్నాయి. దీంతో సాఫ్ట్వేర్ ఆప్లికేషన్లు రూపొందించే కంపెనీలకు నష్టం కలుగుతోంది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన క్లౌడ్ కంప్యూటింగ్‌తో సాఫ్ట్వేర్ పైరసీకి అడ్డుకట్ట వేయవచ్చు. అదే సమయంలో సాఫ్ట్వేర్ వాడకంలోనూ ఖర్చును తగ్గించుకునే వీలుంది. అందుకే భవిష్యత్తు క్లౌడ్ కంప్యూటింగ్‌దే. ఎంత వాడుకుంటే అంతే రుసుము చెల్లించే విధానం వల్ల వినియోగదారులూ ఇటే మొగ్గు చూపుతున్నారు.
- ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), సేవల రంగాలకే పరిమితమైన క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఇప్పుడు వైద్య రంగానికీ తీసుకొచ్చాం.వెబ్ ఆధారితమైన పికాసో.. ఆసుపత్రులకు, రోగులకు విస్రృతమైన ప్రయోజనాలను అందిస్తుంది. వైద్య ప్రక్రియ సులభతరం అవ్వడమే కాక, వేగవంతమవుతుంది కూడా. రేడియాలజీ, ఆర్థోపీడిక్, న్యూరాలజీ, కార్డియాలజీ, ఆప్తాల్మాలజీ, ఆంకాలజీ చికిత్సల్లో పికాసోను వినియోగించుకోవచ్చు.