జైపూర్ ఎక్స్‌ప్రెస్ కాల్పులు.. అకారణంగా కాల్చేశాడా?
ముంబయి: జైపూర్-ముంబయి సూపర్‌ఫాస్ట్ రైలులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రన్నింగ్ ట్రైన్లో తోటి సహోద్యోగులతో సహా ప్రయాణికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్తో సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వేస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
జైపూర్-ముంబయి సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(12956) జైపూర్ నుంచి ముంబయి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్‌గా గుర్తించారు. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న క్రమంలో ఘటనకు పాల్పడ్డాడు. బాధితుడు ఏఎస్ఐ టికారమ్ మీనాగా గుర్తించారు. టికారమ్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు.
నిందితుడు చేతన్ సింగ్ షార్ట్ టెంపర్ అని పశ్చిమ రైల్వే ఎన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్పీఎఫ్ అధికారి ప్రవీణ్ సిన్హా తెలిపారు. ఎస్కార్ట్ డ్యూటీలో అధికారుల మధ్య ఎలాంటి వివాదం జరగలేదని వెల్లడించారు. రైలు జైపూర్ నుంచి మహారాష్ట్రాలోని పాల్ఘర్కు చేరగానే కానిస్టేబుల్ చేతన్ సింగ్ అకారణంగానే కోపానికి లోనై తోటి అధికారులపై కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు.
సీనియర్ అధికారిపై కాల్పులు జరిపిన అనంతరం బోగీ నెంబర్ బీ5 లో ఓ ప్రయాణికునిపై ఫైరింగ్ జరిపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బోగీ బీ6లో మరో ఇద్దరు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. నిందితుడు మొత్తం 12 రౌండ్లు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీనియర్ అధికారితో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఘటనా సమయంలో విధుల్లో మొత్తం ముగ్గురు కానిస్టేబుల్స్‌తో పాటు సీనియర్ ఏఎస్ఐ అధికారి ఉన్నట్లు గుర్తించారు.
కాల్పులు జరిపిన అనంతరం దాహితార్ స్టేషన్ పరిధిలో రైలు చైన్ లాగి నిందితుడు పారిపోయాడని పోలీసులు గుర్తించారు. అయితే.. నిందితున్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రైలు జైపూర్ నుంచి వస్తున్న క్రమంలో గుజరాత్‌లోని సూరత్ రాగానే.. ఈ ఆర్ఫీఎఫ్ పోలీసులు ఎస్కార్ట్ డ్యూటీ విధుల్లో చేరారని తెలిపారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ అధికారి టికారమ్ మీనాకు రూ.15 లక్షల పరిహారాన్ని పశ్చిమ రైల్వే ప్రకటించింది. కాగా.. టికారమ్‌కు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. 80 ఏళ్ల తల్లి ఉంది. 2025లో ఆయన రిటైర్మెంట్ తీసుకోనుండగా.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: 'పాక్ వెళ్లిన అంజు ఘటనలో అంతర్జాతీయ కుట్ర కోణం'