మా ఇళ్లను కూల్చకండి
- సభా సమితి సభ్యుల ఎదుట
- బాధితుల ఆక్రోశం
సాక్షి, బెంగళూరు: ‘ప్రభుత్వమే మాకు హక్కు పత్రాలను ఇచ్చి ఇళ్లను నిర్మించుకునేందుకు అధికారాన్ని కల్పించింది. ఇంతకాలంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు చెల్లిస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెరువులను ఆక్రమించారంటూ మా ఇళ్లను కూల్చేస్తే పిల్లలతో కలిసి ఎక్కడికి వెళ్లాలి. మా ఇళ్లను కూల్చకండి’ అంటూ వివిధ ప్రాంతాల్లోని నివాసితులు సభా సమితి సభ్యుల ఎదుట తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. నగరం చుట్టుపక్కల ప్రాం తాల్లో చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అధ్యయ నం కోసం ఏర్పాటు చేసిన కె.వి.కోళివాడ నేతృత్వంలోని సభా సమితి రెండో రోజైన బుధవారం సైతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. నగరంలోని విజినాపుర చెరువుతోపాటు కౌదేనహళ్లి, బి.నారాయణపుర, బాణసవాడి చెరువులను సమితి సభ్యులు బుధవారం పరిశీలించారు.
సమితి సభ్యులు ఆయా ప్రాంతాలకు చేరుకోగానే తమ ఇళ్లను కూల్చేందుకే అధికారులు వచ్చారని భావించిన స్థానికులు సభాసమితి సభ్యులను చుట్టుముట్టారు. తమకు ఆయా స్థలాలను అమ్మిన వారిని వదిలేసి ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో స్థలాలను కొని ఇళ్లు కట్టుకుంటే ఇలా బలవంతంగా ఖాళీ చేయించాలని చూడడం ఎంత వరకు సమంజసమని ఆయా ప్రాంతాల ప్రజలు సభా సమితి సభ్యులను నిలదీశారు. ఇక కౌదేనహళ్లి చెరువుకు సంబంధించి సర్వే నెం.37లో 34.10 ఎకరాలు కబ్జాకు గురికాగా, బి.నారాయణపుర చెరువులో 7.05 ఎకరాలు, విజినాపుర చెరువులో 10.37 ఎకరాలు, బాణసవాడిలో ఒక ఎకరా ఆక్రమణకు గురయ్యాయని సభా సమితి సభ్యులకు అధికారులు వివరించారు.