యాజమాన్య హక్కుపై బ్యాంకుల చర్చలు
ధ్రువీకరించిన ఐవీఆర్సీఎల్
అధికారిక సమాచారం లేదంటూ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐవీఆర్‌సీఎల్‌లో యాజ మాన్య హక్కులను తీసుకునే అంశమై బ్యాంకులు చర్చిస్తున్నట్లు కంపెనీ సూచనప్రాయంగా తెలి పింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్డీఆర్) స్కీం గురించి అప్పులిచ్చిన బ్యాంకులు చర్చించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ దీనిపై అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం లేదని (బ్యాంకుల నుంచి) బుధవారం స్టాక్ ఎక్స్ఛేం జీలకు తెలియచేసింది. ఇప్పటికే బ్యాంకులు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ (సీడీఆర్) కింద అప్పులను ఈక్విటీగా మార్చుకుంటున్న సంగతి తెలిసిందే. వాటాలు చేతికొస్తున్న నేపథ్యంలో యాజమాన్య హక్కులు కూడా ఎస్డీఆర్ స్కీం కింద తీసుకోవటానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయంటూ వస్తున్న వార్తలపై స్టాక్ ఎక్స్ఛేంజీలు కంపెనీని వివరణ అడిగాయి. ‘బ్యాంకర్ల చేతికి ఐవీఆర్సీఎల్’ అనే శీర్షికన ‘సాక్షి’ ఇటీవలే ఈ వార్తను ప్రచురించింది కూడా. ఆరు బ్యాంకులు కలసి సీడీఆర్ కింద అప్పులను ఈక్విటీగా మార్చుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఆరు బ్యాంకుల చేతిలో 32.02 శాతం వాటా ఉంది. మరో కొంత వాటాను ప్రమోటర్ల నుంచి తీసుకోవడం ద్వారా కంపెనీపై పూర్తి యాజమాన్య హక్కును సాధిం చేందుకు ప్రస్తుతం బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు ధర కూడా కనిష్ఠ స్థాయి నుంచి బాగా పెరగటంతో స్టాక్ ఎక్స్ఛేంజీ వివరణ అడిగింది. ఎస్డీఆర్ నిబంధనల ప్రకారం 51 శాతం వాటాను రుణ సంస్థలు సాధించుకుంటే కంపెనీకి చెందిన పాత ప్రమోటరు యాజమాన్య హోదా నుంచి వైదొలగాల్సి ఉంటుంది.
మరో రుణ సంస్థకు 1.5 కోట్ల షేర్లు జారీ
ఇదే సమయంలో బుధవారం మరో రుణ సంస్థకు అప్పు తీర్చడానికి బదులు 1.5 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయడం విశేషం. డిసెంబర్ 1, 2013 నుంచి ఆగస్టు 31, 2015 వరకు ఇంటర్నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలకుగాను షేరు ధర రూ.24.39 కింద మొత్తం 1,50,46,858 షేర్లను జారీ చేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ప్రస్తుత ప్రమోటర్ల వాటా 8.7 శాతం నుంచి మరింత తగ్గనుంది. అంతేకాకుండా విక్రయానికి పెట్టిన బీవోటీ ప్రాజెక్ట్ తమిళనాడులోని చెంగవల్లి టోల్‌వే ప్రాజెక్టు వాణిజ్యపరంగా బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ వార్తల నేపథ్యంలో బుధవారం ఎన్ఎస్ఈలో ఐవీఆర్సీఎల్ షేరు ఒకానొక దశలో 20% అప్పర్ సర్క్యూట్‌ను తాకి చివరకు 17 శాతం లాభంతో రూ. 9.50 వద్ద ముగిసింది. ఈ మధ్యకాలంలో ఎప్పడూ జరగనంతగా రెండు ఎక్స్ఛేంజీల్లో కలిపి రెండు కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి.