శ్రీశైలంలో 19.385 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో ఆదివారం నుంచి సోమవారం వరకు 19.385 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. సోమవారం సాయంత్రం సమయానికి కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఏడు జనరేటర్లు, భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో మూడు జనరేటర్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 52,399 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి 32వేల క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 6,500 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 202.9673 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 882.70 అడుగులకు చేరుకుంది.