Rijiju
-
ఆరోపణలు చేసేప్పుడు క్లారిటీ అవసరం: రిజిజు
షిల్లాంగ్: పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణల విషయంలో ముందుగా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తికమకకు గురికాకుండా ఒక స్పష్టతకు రావాల్సిన అవసరముందని మేఘాలయలో జరిగిన ఓ కార్యక్రమంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. ‘నోట్ల రద్దు విషయంపై కనీసం ఆర్థిక మంత్రికి కూడా చెప్పకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేశారని ఒకసారి.. ప్రకటనకు ముందే ప్రధాని నోట్లరద్దు విషయాన్ని లీక్ చేశారని ఇంకోసారి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు’ అని రిజిజు అన్నారు. ఏవైనా ఆరోపణలు చేసేటప్పుడు ఒక స్పష్టత అవసరమని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు. -
మోదీ గురించి నోస్ట్రాడామస్ ఏమన్నారంటే...
న్యూఢిల్లీ: ‘భారత దేశాన్ని 2014 నుంచి 2026 వరకు సమర్థుడైన నాయకుడు పాలిస్తాడు. తొలుత ఆ నాయకుడిని ప్రజలు ద్వేషిస్తారు. కానీ ఆయన అనతి కాలంలోనే భారత దేశ దుస్థితిని, దిశను మార్చివేయడాన్ని గమనించి ప్రజలంతా ఆయన్ని ఎంతోగానే ప్రేమిస్తారు. ఆ సమర్థుడైన నాయకుడు భారత దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే బంగారు భవిష్యత్తు తీసుకొస్తాడు. అనేక దేశాలు భారత్ కింద తలదాచుకుంటాయి. ఫ్రెంచ్ బ్రహ్మ నోస్ట్రాడామస్ అన్న మాటలివి. ఇవి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి చేసినవే’ అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు గురువారం రాత్రి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు నోస్ట్రాడామస్ మన ప్రధాని నరేంద్ర మోదీ గురించి 1555లో వేసిన అంచనాలని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా లోక్ సభలో పార్టీల బలాబలాల్లో దాగున్న 13వ సంఖ్య గురించి ప్రస్తావించారు. లోక్ సభలో బీజేపీకి 283 సీట్లు ఉన్నాయని, వీటిని 2+8+3 అని కూడితే 13 సంఖ్య వస్తుందని, అలాగే ఎన్డీయేకు వచ్చిన మొత్తం సీట్ల సంఖ్య 337 అని, వీటిని 3+3+7 అని కూడితే 13 సంఖ్య వస్తుందని, యూపీఏకు వచ్చిన సీట్లు 58 అని, వీటిని 5+8 అని కూడినా 13 సంఖ్య వస్తుందని, అలాగే ఇతర పార్టీలకు వచ్చిన సీట్ల సంఖ్య 148 అని, వీటిని కూడా 1+4+8 కూడినా 13 సంఖ్య వస్తుందని అన్నారు. ఈ సంఖ్యలకు 455 ఏళ్ల క్రితం నోస్ట్రోడామస్ అంచనాలకు లింకేమిటో మాత్రం మన మంత్రి రిజీజు వివరించలేదు. పైగా పాశ్చాత్యుల విశ్వాసం ప్రకారం 13వ సంఖ్య అనర్థదాయకం. రిజీజు ఫేస్ బుక్‌లో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటారు. తాను పాల్గొన్న సభలు, సమావేశాలను సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను ఫేస్ బుక్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటారు. ఆయనకు 36,409 ఫాలోవర్స్ ఉన్నారు. -
ఉగ్రవాద రహిత దేశమే లక్ష్యం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రిజిజు సాక్షి, హైదరాబాద్: భారత్‌ను ఉగ్రవాద రహిత దేశంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ఎజెండా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రిజిజు వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రంలోని కొత్త ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం ఉందని చెప్పారు. వరుసగా ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించేందుకు సమష్టి కృషి జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశీ శక్తుల నుంచే కాకుండా, స్వదేశీ శక్తుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను పసిగట్టాలని సూచించారు. జాతీయ భద్రత అనే అంశంపై హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో ఐదు రోజుల పాటు జరిగే సదస్సును మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉగ్రవాద నిర్మూలనలో యువ ఐపీఎస్‌లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అసాంఘిక శక్తులను సమర్థంగా ఎదుర్కొనేలా ఆలోచించాలని సూచించారు. వామపక్ష తీవ్రవాదాన్ని అదుపు చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనత దేశానికే ఆదర్శప్రాయమని మంత్రి పేర్కొన్నారు. ఎన్పీఏ ఇస్తున్న శిక్షణ, అందిస్తున్న క్రమశిక్షణ అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ తదితరులు పాల్గొన్నారు.