మోదీ గురించి నోస్ట్రాడామస్ ఏమన్నారంటే... | over 450 years ago, nostradamus predicted narendra modi's rule: Rijiju | Sakshi
Sakshi News home page

మోదీ గురించి నోస్ట్రాడామస్ ఏమన్నారంటే...

Published Fri, Mar 18 2016 7:12 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీ గురించి నోస్ట్రాడామస్ ఏమన్నారంటే... - Sakshi

మోదీ గురించి నోస్ట్రాడామస్ ఏమన్నారంటే...

న్యూఢిల్లీ: ‘భారత దేశాన్ని 2014 నుంచి 2026 వరకు సమర్థుడైన నాయకుడు పాలిస్తాడు. తొలుత ఆ నాయకుడిని ప్రజలు ద్వేషిస్తారు. కానీ ఆయన అనతి కాలంలోనే భారత దేశ దుస్థితిని, దిశను మార్చివేయడాన్ని గమనించి ప్రజలంతా ఆయన్ని ఎంతోగానే ప్రేమిస్తారు. ఆ సమర్థుడైన నాయకుడు భారత దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే బంగారు భవిష్యత్తు తీసుకొస్తాడు. అనేక దేశాలు భారత్ కింద తలదాచుకుంటాయి. ఫ్రెంచ్ బ్రహ్మ నోస్ట్రాడామస్ అన్న మాటలివి. ఇవి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి చేసినవే’ అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు గురువారం రాత్రి ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు.

16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు నోస్ట్రాడామస్ మన ప్రధాని నరేంద్ర మోదీ గురించి 1555లో వేసిన అంచనాలని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా లోక్ సభలో పార్టీల బలాబలాల్లో దాగున్న 13వ సంఖ్య గురించి ప్రస్తావించారు. లోక్ సభలో బీజేపీకి 283 సీట్లు ఉన్నాయని, వీటిని 2+8+3 అని కూడితే 13 సంఖ్య వస్తుందని, అలాగే ఎన్డీయేకు వచ్చిన మొత్తం సీట్ల సంఖ్య 337 అని, వీటిని 3+3+7 అని కూడితే 13 సంఖ్య వస్తుందని, యూపీఏకు వచ్చిన సీట్లు 58 అని, వీటిని 5+8 అని కూడినా 13 సంఖ్య వస్తుందని, అలాగే ఇతర పార్టీలకు వచ్చిన సీట్ల సంఖ్య 148 అని, వీటిని కూడా 1+4+8 కూడినా 13 సంఖ్య వస్తుందని అన్నారు.

ఈ సంఖ్యలకు 455 ఏళ్ల క్రితం నోస్ట్రోడామస్ అంచనాలకు లింకేమిటో మాత్రం మన మంత్రి రిజీజు వివరించలేదు. పైగా పాశ్చాత్యుల విశ్వాసం ప్రకారం 13వ సంఖ్య అనర్థదాయకం. రిజీజు ఫేస్ బుక్లో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటారు. తాను పాల్గొన్న సభలు, సమావేశాలను సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను ఫేస్ బుక్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటారు. ఆయనకు 36,409 ఫాలోవర్స్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement