రిమ్స్ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్:
రిమ్స్ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లను సోమవారం రిమ్స్ డెరైక్టర్ అంజయ్య ప్రారంభించారు. మొదటి అడ్మిషన్‌ను శ్రీకాకుళానికి చెందిన విద్యార్థినికి డెరైక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక రిమ్స్ డెరైక్టర్ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజయ్య మాట్లాడుతూ 2013-14 సంవత్సరానికి నర్సింగ్ కాలేజీలో జీఎన్ఎం కోర్సుకు 60 మంది విద్యార్థులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. నవంబర్ 24న విశాఖపట్నం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ అధ్యక్షతన గల కమిటీ విద్యార్థులను ఎంపిక చేసిందని చెప్పారు. రిమ్స్‌లో ప్రవేశం పొందిన 60 మందిలో 51 మంది విద్యార్థినులని, 9 మంది విద్యార్థులని తెలిపారు.
మూడున్నరేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సులో 6 నెలల పాటు మిడ్వైఫరీ శిక్షణను అభ్యర్థులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. నర్సింగ్ కళాశాలకు అధ్యాపకులను నియమించినట్లు చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులకు తరగతి గదలు, లైబ్రరీ, అదే విధంగా వేరు వేరుగా హాస్టల్ వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా *10 కోట్ల నిధులు మంజూరు చేశారని, కానీ విడుదల చేయలేదన్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా 85 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 15 శాతం ఉంటుందన్నారు. మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యకు నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు అనుమతులు మంజూరు చేశారన్నారు. మరో రెండు సార్లు ఎన్.సి.ఐ తనిఖీలు ఉంటాయని చెప్పారు. ఈ తనిఖీల్లోపు నర్సింగ్ భవనాలు కూడా పూర్తి చేయాలన్నారు.
నర్సింగ్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా రాజ్యలక్ష్మిని, వైస్ ప్రిన్సిపాల్ గా కృష్ణవేణిలను నియమించినట్లు తెలిపారు. రిమ్స్‌లో డైట్ కాంట్రాక్టర్‌ను డిస్మిస్ చేశామని, త్వరలో నూతన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పారిశుధ్య కాంట్రాక్టుపై జనవరిలో హైదరాబాద్‌లో నిర్ణయం తీసుకుంటారని, త్వరలో 150 మంది పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు, వైద్యకళాశాల, వైద్యశాలకు నియమితులవుతారన్నారు. వీటితో పాటు 50 మంది సెక్యూరిటీ గార్డులను ఎంపిక చేస్తామన్నారు. అదే విధంగా ఎంబీబీఎస్ విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ అందజేసేందుకు * 10 లక్షలతో నిధిని ఏర్పాటు చేశామన్నారు.
ఇంకా దాతలు స్పందించాలని కోరారు. 4 నెలలుగా ప్రొఫెసర్లకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. విలే కరుల సమావేశంలో రిమ్స్ మెడికల్ డిపార్టుమెంట్ హెచ్ఓడీ డాక్టర్ మల్లికార్జునరావు, ఆరోగ్య శ్రీ ఇన్చార్జి డాక్టర్ కె.సి.టి నాయక్, ఎ.పి.ఐ.ఎం.డి.సి ఇంజినీర్ టి.రవి తదితరులు పాల్గొన్నారు.