ప్రధాని మోదీకి సచిన్ లేఖ
రియో ఒలింపిక్స్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల గురించి భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఉపన్యాసంలో ప్రస్తావించాల్సిందిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోరాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడంలో విఫలమైన, పతకాల రేసులో ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం కలిగించేలా ప్రధాని మాట్లాడాలని, దీనివల్ల క్రీడాకారులు ప్రేరణ పొందుతారని సచిన్ అన్నాడు.
స్వాతంత్ర్య దినోత్సవంనాడు తాను ప్రసంగించే ఉపన్యాసంలో ఏయే విషయాలు ఉండాలో సలహాలు ఇవ్వాల్సిందిగా మోదీ దేశ పౌరులను కోరిన సంగతి తెలిసిందే. ఇటీవల కొత్తగా ఆరంభించిన మొబైల్ అప్లికేషన్ 'నమో'కు పంపాల్సిందిగా సూచించారు. దీనికి స్పందించిన సచిన్.. మోదీ యాప్‌కు లేఖ పంపాడు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు గుడ్ విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సచిన్ జట్టుతో కలసి బ్రెజిల్లో ఉన్నాడు. కాగా ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు ఇప్పటి వరకు ఒక్క పతకం కూడా రాలేదు. దీంతో క్రీడాకారులతో పాటు అభిమానుల్లోనూ నిరాశ ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్రీడాకారులను ఉత్తేజపరిచేలా మాట్లాడాల్సిందిగా మోదీని కోరుతూ సచిన్ లేఖ పంపాడు.