రాహుల్ పర్యటనకు.. అనుమతి నో
ఇటీవల ఠాకూర్లు.. దళితుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగి, ఉద్రిక్తతలు చెలరేగిన ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ ప్రాంతంలో పర్యటించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలకు గండిపడింది. అక్కడ ఆయన పర్యటించేందుకు అనుమతి ఇవ్వలేమని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ ఆదిత్య మిశ్రా తెలిపారు. మొత్తం రాజకీయ నాయకులందరి పర్యటనలను జిల్లా యంత్రాంగం నిషేధించినందున రాహుల్ సహా ఎవ్వరికీ అనుమతి ఇవ్వట్లేదని ఆయన స్పష్టం చేశారు. తొలుత ఈ ప్రాంతాల్లో పర్యటించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పీఎల్ పునియా భావించారు. తనకు అనుమతి రాకపోవడంతో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ఇళ్లు కాలిపోయిన దళిత కుటుంబాలను కలిసి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించాలని రాహుల్ భావించారు.
మే 5వ తేదీన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా షబ్బీర్పూర్ గ్రామంలో ఠాకూర్లు ఊరేగింపు జరపగా దానికి దళితులు అడ్డు చెప్పడం, ఆ సందర్భంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలలో ఒక ఠాకూర్ యువకుడు మరణించడంతో రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు చెలరేగాయి. దళితులకు చెందిన 50 గుడిసెలు తగలబడ్డాయి. వారిలో కొందరు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ వారం ప్రారంభంలో ఆ గ్రామాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి సందర్శించిన తర్వాత మళ్లీ గొడవలు చెలరేగి మరో వ్యక్తి మరణించాడు. దాంతో ఇక ఇక్కడకు రాజకీయ నాయకులు ఎవ్వరినీ అనుమతించకూడదని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. పరిస్థితి మొత్తం సాధారణ స్థితికి చేరుకునేవరకు ఎవరికీ అనుమతి ఇవ్వబోమని అదనపు డీజీ ఆదిత్య మిశ్రా చెప్పారు.