OpenAI : భారతీయుడు రిషీ జైట్లీకి జాక్‌పాట్!
భారతీయుడు, మాజీ ట్విటర్ ఇండియా హెడ్ రిషీ జైట్లీకి జాక్ పాట్ తగిలింది. సలహాలు తీసుకునేందుకు రిషిని ఓపెన్ ఏఐ నియమించుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంపై చాట్‌జీపీటీ (openai) సృష్టికర్త ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా దేశీయంగా కృత్తిమమేధ పాలసీ, విధి విధానాల అమలు వంటి అంశాలపై సలహాలు తీసుకునేందుకు ట్విటర్ మాజీ ఇండియా హెడ్ రిషి జైట్లీని సలహాదారుగా నియమించున్నట్లు సమాచారం.
టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ‘‘జైట్లీ ఓపెన్ఏఐలో సీనియర్ సలహాదారుగా చేరారు. ఏఐ విధానాలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలతో కుదుర్చుకునే ఒప్పందాలు మరింత సులభ తరం చేసేందుకు ఆల్ట్‌మన్ సిద్ధమయ్యారు. ఏఐకి ఉన్న డిమాండ్ దృష్ట్యా దేశీయంగా ఆయా విభాగాల్లో నిష్ణాతులైన నిపుణులను ఓపెన్ ఏఐ నియమించుకుంటుంది’’ అని టెక్ క్రంచ్ నివేదిక హైలెట్ చేసింది.
మోదీతో ఆల్ట్‌మన్ భేటీ
ఈ ఏడాది భారత పర్యటన సందర్భంగా జూన్ 9న ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘‘కృత్రిమ మేధ గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం కృత్రిమ మేధ వల్ల భారత్‌లో వచ్చే ఉద్యోగావకాశాలు, దాని వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి చర్చించాం. కృత్రిమ మేధకు చట్టబద్ధత కల్పించడంపై కూడా మా మధ్య చర్చ జరిగింది’’ అని శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు.
ఎవరీ రిషీ జైట్లీ
రిషీజైట్లీ 2007 - 2009 మధ్య భారత్ తరపున ప్రైవేట్ - పబ్లిక్ పార్ట్నర్ షిప్ గూగుల్ విభాగం అధినేతగా పనిచేశారు. తదనంతరం, 2012లో ట్విటర్ హెడ్‌గా చేరారు. 2016 చివరలో ట్విటర్‌ను వదిలేసి జైట్లీ, టైమ్స్ గ్రూప్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ విభాగమైన టైమ్స్ బ్రిడ్జ్ సహ వ్యవస్థాపకుడి కలిసి సీఈఓగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.