ఇన్ఫీకి రితికా సూరి గుడ్‌బై!
ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ పదవికి రాజీనామా...
న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్’లో ఏదో జరుగుతోంది. వేతన ప్యాకేజ్, కార్పొరేట్ గవర్నెన్స్, విలీనాలు, ఉద్యోగాల కోత, రాజీనామాలు ఇలా పలు అంశాలకు సంబంధించి గత కొన్ని నెలలుగా సంస్థ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తోంది. తాజాగా ఇప్పుడు కంపెనీ నుంచి రితికా సూరి వైదొలిగారనే వార్త వైరల్ అయ్యింది. కంపెనీలో ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్‌గా(ఈవీపీ) వ్యవహరిస్తున్న ఆమె తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఆటోమేషన్ సంస్థ పనాయ కొనుగోలులో సూరి కీలక పాత్ర పోషించారు. ఎస్ఏపీకి చెందిన ఈ మాజీ ఎగ్జిక్యూటివ్‌ను విశాల్ సిక్కా 2014 సెప్టెంబర్‌లో ఇన్ఫీలోకి ఆహ్వానించారు.
తర్వాత ఆమె ఈవీపీగా (కార్పొరేట్ డెవలప్మెంట్ అండ్ వెంచర్స్) పదోన్నతి పొందారు. స్టార్టప్‌లలో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి వీలుగా ఇన్ఫోసిస్ 500 మిలియన్ డాలర్ల వెంచర్ ఫండ్ ఏర్పాటు చేసింది. ఇందులోనూ సూరి కీలకపాత్ర వహించారు. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రితికా సూరి గతవారం తన రాజీనామా లేఖను మేనేజ్మెంట్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె పదవి నుంచి ఎందుకు వైదొలుగుతున్నారో తెలియడం లేదు. పనాయ డీల్‌కు ఇన్ఫీ ఎక్కువగా చెల్లించిందనే విమర్శలొచ్చాయి. దీనిపై గిబ్సన్ డన్ అండ్ క్రూచర్ సంస్థ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. ఇది ఇన్ఫోసిస్‌కు క్లీన్చిట్ ఇచ్చింది. అయితే ఇన్ఫోసిస్ ఈ రాజీనామా వార్తలపై స్పందించలేదు. కాగా ఇన్ఫోసిస్ అమెరికాస్ హెడ్ సందీప్ డెడ్లాని కొద్ది రోజుల క్రితం సంస్థ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు రితికా సూరి తన పదవికి రాజీనామా చేశారు.