తివారీ పెళ్లికొడుకాయెనే..
లక్నో: కాంగ్రెస్ కురు వృద్ధుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌దత్ తివారీ గురువారం తన చిరకాల స్నేహితురాలు ఉజ్వలాశర్మను వివాహం చేసుకున్నారు. బుధవారం రాత్రి మాల్ అవెన్యూలోని తివారీ నివాసంలో ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో తమ పెళ్లి జరిగినట్లు ఉజ్వలాశర్మ (67) తెలిపారు. కొద్ది రోజుల క్రితం తివారీ(88) పెళ్లి ప్రతిపాదన తెచ్చినట్లు చెప్పారు. తమ బంధానికి సామాజిక ఆమోదం లభించినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. అధికారిక ప్రకటన అనంతరం వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు లభించేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తివారీ కార్యాలయం పేర్కొంది. రిటైర్డ్ లెక్చరర్ ఉజ్వలాశర్మ ద్వారా తనకు రోహిత్ శేఖర్ అనే కుమారుడు ఉన్నట్లు దీర్ఘకాల న్యాయపోరాటం అనంతరం ఇటీవలే తివారీ అంగీకరించిన విషయం తెలిసిందే. డీఎన్ఏ పరీక్షల అనంతరం రోహిత్‌ను తన కుమారుడిగా తివారీ అంగీకరించారు. తివారీ నివాసంలోకి తనను అనుమతించకపోవటంతో ఉజ్వలాశర్మ కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసుల జోక్యంతో ఈ వివాదం చల్లబడి ఇద్దరూ అదే ఇంట్లో సహజీవనం చేసేందుకు సమ్మతించారు. తివారీ మొదటి భార్య కొద్ది సంవత్సరాల క్రితం మరణించారు.