Ritu parna
-
నార్త్ ఈస్టర్న్ వారియర్స్ బోణీ
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ బోణీ చేసింది. గురువారం జరిగిన పోరులో 4–1తో ముంబై రాకెట్స్‌ను చిత్తు చేసింది. నార్త్ ఈస్టర్న్ వారియర్స్ సభ్యురాలైన భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. మిక్స్డ్ డబుల్స్‌తో మొదలైన ఈ పోరులో నార్త్ ఈస్టర్న్ జంట లియావో మిన్ చన్–కిమ్ హ న 15–6, 15–13తో కిమ్ జి జంగ్–పియ జబదియా (ముంబై) జోడీపై గెలిచింది. ముంబై ట్రంప్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సెన్సోమ్బున్సుక్ (నార్త్ ఈస్టర్న్) 15–9, 10–15, 15–11తో అంటోన్సెన్ను కంగుతినిపించడంతో ముంబై –1 స్కోరుకు పడిపోయింది. తర్వాత మహిళల సింగిల్స్ వారియర్స్‌కు ట్రంప్ మ్యాచ్ కాగా... ఇందులో రీతుపర్ణ దాస్ 12–15, 15–10, 15–12తో శ్రేయాన్షి పరదేశి (ముంబై)ని ఓడించింది. దీంతో నార్త్ ఈస్టర్న్ 4–(–1)తో మరో రెండు మ్యాచ్‌లుండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది. రెండో పురుషుల సింగిల్స్‌లో టియాన్ హౌవీ (నార్త్ ఈస్టర్న్) 6–15, 13–15తో సమీర్ వర్మ (ముంబై) చేతిలో పరాజయం చవిచూడగా, పురుషుల డబుల్స్‌లో లియావో మిన్ చన్–యు ఇయాన్ సియంగ్ (నార్త్ ఈస్టర్న్) ద్వయం 12–15, 15–13, 7–15తో కిమ్ జి జంగ్–లీ యంగ్ డే (ముంబై) చేతిలో ఓడింది. శుక్రవారం జరిగే పోటీల్లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో బెంగళూరు రాప్టర్స్, హైదరాబాద్ హంటర్స్‌తో అవధ్ వారియర్స్ తలపడతాయి. -
సాత్విక్ ‘డబుల్’
సింగిల్స్ చాంప్స్ రితూపర్ణ, సౌరభ్ వర్మ పట్నా: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు మెరిశారు. మంగళవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో డబుల్స్ విభాగాలలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ రెండు టైటిల్స్‌ను సాధించగా... తెలంగాణ క్రీడాకారిణి రితూపర్ణ దాస్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు (పీఎస్‌పీబీ) ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్ ఆటగాడు సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్‌లో రెండోసారి విజేతగా నిలిచాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ద్వయం 21–17, 16–21, 21–14తో నందగోపాల్ (కాగ్)–సాన్యమ్ శుక్లా (ఎయిరిండియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఎయిరిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ కె. మనీషాతో జతకట్టిన సాత్విక్ ఫైనల్లో 21–14, 21–18తో వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (చత్తీస్‌గఢ్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో హైదరాబాద్‌లో స్థిరపడిన బెంగాలీ అమ్మాయి, రెండో సీడ్ రితూపర్ణ దాస్ 21–12, 21–14తో తొమ్మిదో సీడ్ రేష్మా కార్తీక్ (ఎయిరిండియా)పై గెలిచి తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2011 చాంపియన్ సౌరభ్ వర్మ 21–13, 21–12తో ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించాడు.