జగన్నాథుడి ఆఖరి డాన్సర్ మృతి
న్యూఢిల్లీ: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం ఆఖరి డాన్సర్ (దేవదాసి) శశిమణి దేవి (92) ఇటీవల పూరిలో మరణించారు ఆమె మరణాన్ని రాష్ట్ర సాంస్కృతి విభాగంలో పనిచేసి రిటైరైన దేవదత్త సమంతా సింఘార్ ధ్రువీకరించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నిరుపేద కుటుంబానికి చెందిన శశిమణి తన ఎనిమిదవ ఏట దేవదాసిగా జగన్నాథ ఆలయంలో చేరారు. తన జీవిత సర్వస్వాన్ని ఆమే ఆ జగన్నాథుడికే అంకితం చేశారు. ఆమెను సాక్షాత్తు జగన్నాథుడి సజీవ భార్యగానే ఆలయ నిర్వాహకులు, భక్తులు పరిగణించేవారు. ఆలయ రికార్డుల ప్రకారం ఆమె బాల్యంలో ఆమెతోపాటు మొత్తం పాతిక మంది దేవదాసీలు ఉండేవారు.
వారందరు ఇదివరకే చనిపోగా శశిమణి గురువారం చనిపోయారు. ఆలయం గర్భగుడిలో పవలింపు సేవ కింద జగన్నాథుడిని పాటలు, నృత్యాలతో ప్రతిరోజు అలరించడం దేవదాసిల విధి. ఉదయం లేవగానే ఆలయంలోని విగ్రహాలన్నింటికి స్నానపానాదులు చేయించడం కూడా వారి వృత్తి ధర్మంగానే చాలాకాలం కొనసాగింది. రానురాను ఆలయ విధుల్లో వారి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. దేవదాసిల వ్యవస్థను రద్దు చేయాలంటూ సాంఘిక ఉద్యమాలు చెలరేగడంతో జగన్నాథ ఆలయంలో కూడా శశిమణి బ్యాచ్ తర్వాత మరెవరిని దేవదాసీలుగా స్వీకరించలేదు. 13 నుంచి 15వ శతాబ్దం వరకు ప్రతి హిందూ దేవాలయంలోవున్న ఈ ఆచారం క్రమంగా కనుమరగవుతూ వచ్చింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో ఈ దురాచారం కొనసాగుతోంది.
ఒకప్పుడు దేవదాసీల జీవనోపాధికి గుడి మాన్యాలను కేటాయించేవారు. వారు ఆ మాన్యాల కౌలుపై వచ్చే సొమ్ముతో జీవించేవారు. గుడి మాన్యాల కేటాయింపు పద్ధతి నిలిచిపోయిన తర్వాత దేవదాసీలు జీవనోపాధి కోసం వ్యభిచారం చేసేవారు. పూరి జగన్నాథ ఆలయంతో మాత్రం దేవదాసీలు ఎవరూ కూడా వ్యభిచార వృత్తిని ఆశ్రయించలేదని, వారికి దేవాలయమే ఒక్కొక్కరికి ఆ రోజుల్లోనే నెలకు 700 రూపాయల చొప్పున పింఛను చెల్లించేవారని జగన్నాథుడి ఆలయ ఆచార, వ్యవహాలరాలపై విశేష పరిశోధనలు చేసిన సమంతా సింఘార్ తెలిపారు.
1990లో కూడా దేవదాసీలను నియామకం కోసం జగన్నాథుడి ఆలయంలో ప్రయత్నాలు జరిగాయని, దేవదాసీ ఆచార బాధ్యతలు స్వీకరించేందుకు స్వచ్ఛందంగా ఎవరూ ముందుకు రాలేదని, దాంతో ఈ ఆలయంలో కూడా ఆ ఆచారం ఆగిపోయిందని సింఘాల్ వివరించారు. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా సాంఘిక ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న 1950వ దశకంలో కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు శశిమణి నిరాకరించి దేవదాసీగా కొనసాగేందుకే ఇష్టపడ్డారని తెలిపారు.