వార్నర్ సెంచరీ, మాక్స్ వెల్ మెరుపులు
సిడ్నీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీ(119 బంతుల్లో 130: 11 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్ వెల్(44 బంతుల్లో 78 పరుగులు: 10 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. వన్డే సిరీస్‌లో భాగంగా ఇక్కడ వన్డేలో ఆసీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసి, ప్రత్యర్థి పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(49 బంతుల్లో 30: 2 ఫోర్లు), వార్నర్ శుభారంభాన్నిచ్చారు. 17.2 ఓవర్లలో 92 పరుగల వద్ద హసన్ అలీ బౌలింగ్‌లో కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌కు క్యాచిచ్చి ఖవాజా ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకొచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి వార్నర్ పరుగుల వరద పారించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని(120 రన్స్) నెలకొల్పారు. 212 స్కోరు వద్ద వార్నర్ వెనుదిరిగాడు. హెడ్ హాఫ్ సెంచరీ (36 బంతుల్లో 51: 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయగా, స్మిత్(48 బంతుల్లో 149: 5 ఫోర్లు) తృటిలో అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. మాక్స్ వెల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. చివరి రెండు ఓవర్లలో ఓవర్‌కు మూడు చొప్పున ఫోర్లు బాదిన మాక్స్ వెల్ ఇన్నింగ్ చివరి బంతికి ఔటయ్యాడు. పాక్ బౌలర్ హసన్ అలీ 5 వికెట్లు సాధించగా, ఆమిర్ ఒక వికెట్ తీశాడు. సిరీస్‌లో 2-1తో ఆసీస్ ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.