మరుదుకు డీఎంకే చాన్స్
ఆర్కేనగర్ డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్‌కు అవకాశం కల్పించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ధ్రువీకరించారు.
సాక్షి, చెన్నై: 2016 ఆర్కేనగర్ ఎన్నికల్లో అమ్మ జయలలితను డీఎంకే అభ్యర్థిగా సిమ్లా ముత్తు చోళన్ ఢీకొట్టారు. ఆ ఎన్నికల్లో 57 వేల మేరకు ఓట్లు సిమ్లా ఖాతాలో పడ్డాయి. అయితే, గెలుపు మాత్రం అమ్మ జయలలితను వరించింది. నలభై వేల మెజారిటీతో జయలలిత గెలిచారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సిమ్లా ముత్తు చోళన్కు ఉపఎన్నికల్లో అవకాశం దక్కవచ్చన్న చర్చ డీఎంకేలో సాగింది. ఇందుకు తగ్గట్టుగా ఆమె సీటు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. సిమ్లాకు అవకాశం ఇచ్చి ఉంటే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉండొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి.
అయితే, సిమ్లాను పక్కన పెట్టి మరుదుగణేషన్కు అవకాశం కల్పించడం గమనార్హం.
మరుదుకు చాన్స్: డీఎంకే సీని యర్ నాయకురాలు, మా జీ మంత్రి సర్గుణ పాండియన్ కుటుంబానికి చెందిన సిమ్లాకు ఈ సారి అవకాశం దక్కలేదు. ఇటీవలే సర్గుణ పాండియన్ అనంత లోకాలకు చేరారు. అందుకే కాబోలు ఆమెను పక్కన పెట్టి మరుదు గణేషన్‌కు
డీఎంకే అధిష్టానం చాన్స్ ఇచ్చినట్టుంది. మొత్తంగా సీటును ఆశిస్తూ 17 మంది దరఖాస్తులు చేసుకోగా, వీరి వద్ద డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఇంటర్వూ్యలు చేశారు.
ఆ సీటుకు అర్హుడిగా మరుదు గణేష్‌ను తేల్చారు. ఆర్కేనగర్ తూర్పు విభాగం డీఎంకే కార్యదర్శిగా ఈ గణేషన్ వ్యవహరిస్తున్నారు. స్థానికుడు కావడం, ఓటర్లకు, స్థానిక పార్టీ వర్గాలకు సన్నిహితుడిగా ఉన్న గణేషన్‌కు గెలుపు అవకాశాలు ఏమేరకు ఉంటాయో అన్నది వేచి చూడాల్సిందే. బుధవారం పార్టీ కార్యాలయంలో అన్భళగన్, స్టాలిన్ తమ అభ్యర్థి మరుదుగణేషన్ పేరును ఖరారు చేస్తూ ప్రకటించారు. తన గెలుపు తథ్యం అన్న ధీమాలో గణేషన్ ఉన్నారు. తన అభ్యర్థిత్వ ఖరారుతో మిత్ర పక్షం కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ను ఆయన కలిశారు. తమ మద్దతు డీఎంకేకు అని ప్రకటించిన తిరునావుక్కరసర్, గెలుపు లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తామన్నారు.