చెరో ఆకూ ఇస్తే పోలా..!
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్!
‘పాపం శశికళ వర్గానికి అన్నేయం జరిగిందెహె’ అన్నాడు ఏకాంబరం నిట్టూర్పుగా. ‘అంత అన్నాయం ఏం జరిగిందేటి? ఆయమ్మ చెప్పినోళ్లే పెబుత్వంలో ఉన్నారు కదా’ అన్నాడు చిదంబరం. ‘అది కాదేస్... ఆర్కే నగర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? శశికళకి రెండాకుల గుర్తు ఇచ్చేది లేదని చెప్పేసింది. పాపం శశికళ జైల్లో మనసు బాధపెట్టేసుకుని కూకుంది’ అన్నాడు ఏకాంబరం. ‘అర్రెర్రె... మరయితే రెండాకుల గుర్తును కొంపదీసి పన్నీరు సెల్వం బాబు వర్గానికి కానీ ఇచ్చారేటి?’ అని ఆతృతగా అడిగాడు చిదంబరం.
‘వాళ్లకీ ఇవ్వలేదేస్. ఒకళ్లకేమో దీపపు స్థంభం ఇచ్చారు... మరొకరికి ఎంజీఆర్ బాబుగోరి టోపీ ఇచ్చారు. రెండాకులు మాత్రం ఎవరూ వాడకండర్రా అని రూలు పెట్టారు. ఏం న్యాయంరా ఇది?’ అన్నాడు ఏకాంబరం.‘ఎలక్షన్ కమిషనర్ అంటే బోలెడు సదూకుంటారు కదా... వాళ్లకి కూడా ఈ పాటి చిన్న సమస్య తీర్చడం రాదేంట్రా?’ అన్నాడు చిదంబరం.‘ఇక్కడ కూకుని కబుర్లు చెప్పడం కాదురా ఎర్రినాయాలా? ఇడవమంటే పాముకి కోపం... కరవమంటే కప్పకు కోపం అని... రెండాకుల గుర్తు ఎవరికి ఇచ్చినా రెండోవాళ్లకి కోపం వస్తాది. అందుకే మరి ఈసీ బాబుగారు బాగా ఆలోచిత్తూ కూకున్నారు’ అన్నాడు ఏకాంబరం.
చిదంబరం గట్టిగా నవ్వేసి – ‘అదే నేనయితే ఒక్క నిముషంలో ఇసయం తేల్చేద్దును తెలుసా’ అన్నాడు గర్వంగా.ఏకాంబరానికి కోపమూ... ఆశ్చర్యమూ ఒకేసారి వచ్చాయి. ‘సోది ఆపరా. నువ్వయితే ఏటి సేత్తావేటి?’ అని కోపంగానే అడిగాడు.‘దాందేముందిరా... ఉన్నవి రెండాకులు. ఇద్దరికీ చెరో ఆకు ఇస్తే పోలా. అపుడు ఇద్దరికీ నేయం చేసినట్లయ్యేది. పైగా గొడవా ఉండేది కాదు’ అన్నాడు చిదంబరం. ఏకాంబరం నోట మాట లేదు.