R.K.ROJA
-
రాజకీయాలకు పట్టిన చెద బాబు : ఎమ్మెల్యే రోజా
♦ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎమ్మెల్యేలను కొంటున్నారు ♦ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సాక్షి, హైదరాబాద్: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులను ఎర వేసి సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారు. వారికి టీడీపీ కండువాలు కప్పుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాజకీయాలకు పట్టిన చెద చంద్రబాబు. క్యాన్సర్ వ్యాధిలా చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాన్ని ఉపేక్షిస్తే.. ఇది అన్ని రాష్ట్రాలకూ పాకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు అనైతిక రాజకీయాలను ఎండగట్టడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఏపీలో సీఎం చంద్రబాబు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును జాతీయ నేతలకు వివరించారు. చంద్రబాబు అవినీతిని చూసి దేశం నివ్వెరపోతోంది. సీబీఐ విచారణ జరిగితే చంద్రబాబు, లోకేశ్ జైలుకెళ్లడం ఖాయం’’ అని రోజా పేర్కొన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు అవినీతిపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతుంటే మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కల్లు తాగిన కోతుల్లా అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. జైలుకెళ్లిన వారు మమ్మల్ని విమర్శిస్తారా అంటూ చంద్రబాబు, లోకేష్ మాట్లాడుతుండటం హేయమని రోజా అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేసి జైలుకెళ్లలేదన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘ నువ్వు నిప్పువైతే ఈ కేసుల్లో సీబీఐ విచారణకు సిద్ధమా’’ అని రోజా సవాల్ విసిరారు. బ్రాండ్ ఇమేజ్ కాపాడేందుకే జగన్ పోరాటం ‘‘అవినీతి, అక్రమాలు, నీతిమాలిన రాజకీయాలతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ను చంద్రబాబు దెబ్బతీస్తుంటే.. రాజధాని, ఏపీ బ్రాండ్ ఇమేజ్ను కాపాడటం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమిస్తున్నారు. రెండేళ్లలో తండ్రీ కొడుకులు దోచుకున్న రూ.1.34 లక్షల కోట్లను ప్రజలకు పంపిణీ చేసి.. క్షమాపణ కోరాలి’’ అని ఆర్.కె.రోజా డిమాండ్ చేశారు. -
నేరస్తులకు ప్రభుత్వ రక్షణ
సాక్షి, హైదరాబాద్: మహిళలపై దౌర్జన్యాలు చేసి వారి మరణాలకు కార కులైన నేరస్తులను చంద్రబాబునాయుడి ప్రభుత్వం వెనకేసుకొస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. నేరస్థులకు అండగా నిలిచి మహిళా వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర ఉందని సాక్షాత్తూ మృతురాలి తండ్రి మొరపెట్టుకుంటున్నా నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తాము బాబూరావు పేరు ప్రస్తావించగానే టీడీపీ నేత ధూళి పాళ్ల నరేంద్ర, మంత్రి గంటా శ్రీనివాసరావు ఉలిక్కిపడ్డారన్నారు. బాబూరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలేవీ లభించలేదని డీజీపీ జేవీ రాముడు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. దర్యాప్తులు లేవు, నివేదికలు రావు.. తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేసిన కేసులో విచారణే ముందుకు సాగడంలేదని విమర్శించారు. నారాయణ విద్యాసంస్థల్లో ఇద్దరమ్మాయిల మరణంపై త్రిసభ్య విచారణ కమిటీ నివేదిక రాలేదని, పుష్కరాల్లో మహిళల మరణాలపై ఏం దర్యాప్తు చేస్తున్నారో తెలియదని, రిషితేశ్వరి మృతిపై విచారణ జరిపిన బాలసుబ్రమణ్యం కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదని రోజా ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో మంత్రి నారాయణ టీడీపీకి మద్దతునిచ్చారు కాబట్టే ఆయన విద్యాసంస్థల్లో 11 మంది మృతి చెందినా సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించకుండా అండగా నిలిచారన్నారు. మంత్రి గంటాకు నారాయణ వియ్యంకుడు కావడంతో అక్కడ ఎంత మంది చనిపోయినా విచారణకు ఆదేశించరన్నారు. కడప నారాయణ కాలేజీలో ఒకే రూంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతదేహాలపై గాయాలున్నందున రీపోస్ట్‌మార్టం జరపాలని ఆ విద్యార్థినుల కుటుంబాలను పరామర్శించే సందర్భంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై మహిళలు స్పందించాలని, మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నపుడు వారిని నిలదీయాలని రోజా పిలుపు నిచ్చారు. -
మీ ఆడపడుచును ఆదరించండి
పుత్తూరు రూరల్, న్యూస్‌లైన్ : ‘మీ ఆడపడుచుగా భావించి నన్ను ఆదరించండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఆర్.కె.రోజా కోరారు. ఆమె గురువారం గేట్‌పుత్తూరు 5వ వార్డులో గడప గడపలో ఒకే నినాదం వైఎస్సార్ కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. రెండవ రోజు ఆమెకు మహిళలు అఖండ స్వాగతం పలికారు. ఆమెకు శాలువలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా రోజా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం వైఎస్సార్ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. తెలుగు జాతిలో చిచ్చు పెట్టి వేడుక చూస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్య నినాదంతో ముందుకెళుతోందన్నారు. జగనన్న ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 5వ వార్డులో మురుకులు కాలుస్తూ తమను ఆదరించాలని అభ్యర్థించారు. జిల్లా కన్వీనర్ కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. నగరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి సమైక్య వాదని, సమైక్య నినాదంతో ముందుకు వెళుతున్నారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దేశంలోని అన్ని పార్టీల నాయకులు, అధ్యక్షుల మద్దతు కూడగడుతున్నారని తెలిపారు. సమైక్యవాది ఎవరైనా ఉన్నారంటే ఒక్క వైఎస్.జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ, విభజన వాదానికి ఆజ్యం పోసిన మూలకారకుడు చంద్రబాబని ఆరోపించారు. అధిష్టానం ఆదేశాల మేరకు రోజుకొక ప్రకటన చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని రాయలసీమ ప్రజలు క్షమించరన్నారు. బ్రదర్ అనిల్‌కుమార్ తండ్రి మృతిపై సంతాపం తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రోజా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు.