పెండింగ్ కేసులు పరిష్కరించడమే లక్ష్యం
– జూనియర్ సివిల్ జడ్జి ఆర్ఎం.శుభవల్లి
బద్వేలు అర్బన్: దీర్ఘ కాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరువురి సమ్మతంతో పరిష్కరించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జూనియర్ సివిల్ జడ్జి ఆర్ఎం.శుభవల్లి అన్నారు. శనివారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఆమె మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోకుండా కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకున్నప్పుడే మానవ జీవితానికి సార్థకత ఉంటుందని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో 14 క్రిమినల్ కేసులు , ఒక సివిల్ కేసు పరిష్కరించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డిఎ.కుమార్, ఈ.చంద్ర ఓబుల్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు బ్రహ్మారెడ్డి , లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయవాది వాసుదేవరావు, న్యాయవాదులు రమణారెడ్డి, మురళి, లోక్ అదాలత్ బెంచ్‌మెంబర్లు నాగభూషణమ్మ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.