‘బ్యాంకులు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలి’
బోట్‌క్లబ్(కాకినాడ), న్యూస్‌లైన్: సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికరంగ ప్రోత్సాహానికి బ్యాంకులు ముందుండాలని రిజర్వు బ్యాంక్ జనరల్ మేనేజర్ ఆర్ఎన్ డాష్ పేర్కొన్నారు. స్థానిక ఐశ్వర్యగ్రాండ్ హోటల్లో బుధవారం రిజర్వుబ్యాంక్ , చిన్న తరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పరిశ్రమలు బ్యాంకు రుణాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి అడ్వైజరి కమిటీతో పాటు, రిజర్వు బ్యాంక్ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. అదే తరహాలో జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీలో తప్పని సరిగా చర్చించాలన్నారు.
లీడ్ బ్యాంక్, జిల్లా పరిశ్రమల కేంద్రం నమూనా ప్రాజెక్టులను తయారు చేసి వారికి అవగాహన కల్పించాలని సూచిం చారు. అలాగే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలపై విసృ్తత ప్రచారం చేయాలన్నారు. ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్ కేవీ కన్నన్ మాట్లాడుతూ చిన్న పరిశ్రమలకు రుణాలు కల్పించేందుకు తమ బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. కోయంబత్తూరు, ఫరీదాబాద్ వంటి జిల్లాల్లో కంటే తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంక్‌లు అత్యధిక క్రెడిట్ రేషియో పాటిస్తూ రుణాలు ఇస్తున్నాయన్నారు. అయినా అక్కడ కనిపించే చిన్న తరహా పరిశ్రమల పురోగతి ఇక్కడ లేదన్నారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ బీవీ రామారావు మాట్లాడుతూ బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయడానికి పారిశ్రామికవేత్తలను తిప్పతున్నారన్నారు. ఎస్బీహెచ్ డీజీఎం కె. రమేష్‌బాబు, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం వి. సత్యనారాయణమూర్తి, ఎస్బీఐ ఏజీఎం మూర్తి, సూక్ష్మ చిన్న పరిశ్రమల కేంద్ర విభాగం అసిస్టెంట్ డెరైక్టర్ సుభాష్ ఇన్గేవర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఎన్. లక్ష్మణరావు, ఎల్డీఎం జగన్నాథస్వామి పాల్గొన్నారు.