Ro Khanna
-
అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు జరిగిన పార్లమెంట్ దిగువసభ ఎన్నికల్లో గెలిచిన నలుగురు హిందువులు శుక్రవారం సభలో అడుగుపెట్టారు. అమెరికాలో మైనారిటీ వర్గమైన హిందువులు ఒకేసారి నలుగురు దిగువసభకు ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఆరుగురు భారతీయ మూలాలున్న వ్యక్తులు ఈసారి దిగువసభ ఎన్నికల్లో గెలవగా వారిలో నలుగురు హిందువులుకావడం విశేషం. గెలిచిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల్లో క్రైస్తవేతర, యూదుయేతర మతవిశ్వాసం ఉన్న వ్యక్తులు కేవలం 14 మంది మాత్రమే. వీరిలో హిందువులు నలుగురు, ముస్లింలు నలుగురు, బౌద్ధులు ముగ్గురు, ఏ మతాన్ని ఆచరించని వాళ్లు ముగ్గురు ఉన్నారు. హిందువులు సుహాస్ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం, రో ఖన్నా, శ్రీ థానేదార్ తాజాగా ఎన్నికల్లో విజయపతాక ఎగరేయడం తెల్సిందే. భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్ ప్రమీలా జయపాల్ తన మతం ఏమిటనేది పేర్కొనలేదు. భారతీయ మూలాలున్న మరో సీనియర్ దిగువసభ సీనియర్ సభ్యుడు డాక్టర్ అమీ బెరా దేవుడొక్కడే అనే విశ్వాసాన్ని తాను నమ్ముతానని చెప్పారు. ‘‘12 ఏళ్ల క్రితం నేను దిగువసభలో ప్రమాణంచేసేటపుడు నేనొక్కడినే భారతీయఅమెరికన్ను. ఇప్పుడు మా బలం ఆరుకు పెరిగింది’’అని అమీబెరీ అన్నారు. మొత్తం సభ్యుల్లో క్రైస్తవులదే మెజారిటీ కాగా 31 మంది(ఆరు శాతం) యూదు మతస్థులున్నారు. గెలిచిన రిపబ్లికన్ పార్టీ సభ్యుల్లో 98 శాతం మంది, డెమొక్రటిక్ పార్టీ సభ్యుల్లో 75 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. స్పీకర్‌గా మళ్లీ మైక్ 52 ఏళ్ల మైక్ జాన్సన్ ప్రతినిధుల సభ స్పీకర్‌గా మళ్లీ ఎన్నికయ్యారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పదవికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా కేవలం మూడు ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన నెగ్గారు. గత వందేళ్ల చరిత్రలో ఇంత తక్కువ మెజారిటీతో గెలిచిన స్పీకర్‌గా మైక్ చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున మైక్ బరిలో దిగారు. దిగువసభలో 219 మంది రిపబ్లికన్లు ఉండగా, 215 మంది డెమొక్రాట్లు ఉన్నారు. ఈయనకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 215 మంది పడ్డాయి. డెమొక్రటిక్ సభ్యుడు హకీమ్ జెఫ్రీస్ సైతం మైక్‌కే ఓటేయడం విశేషం. స్వల్ప మెజారిటీతో నెగ్గిన మైక్ వెంటనే స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. -
టీసీఎస్‌లో అమెరికా కాంగ్రెస్ బృందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రో ఖన్నా సారథ్యంలోని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లోని టీసీఎస్ కార్యాలయాన్ని సందర్శించింది. టాటా గ్రూప్, టీసీఎస్ కార్యకలాపాల గురించి ఈ సందర్భంగా వారికి టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి రాజన్న వివరించారు. అమెరికాకు విజిటర్ వీసాల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఆయన కోరారు. అమెరికన్ ఎంబసీ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్, తెలంగాణ ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీ, తెలంగాణ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ బాలయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
అమెరికా మధ్యంతరంలో ఐదుగురు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ దిగువ సభకు జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు బరిలో దిగారు. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ స్థానం నుంచి 57 ఏళ్ల అమీ బేరా ఆరోసారి రేసులో ఉన్నారు. 46 ఏళ్ల రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని ఏడో స్థానం నుంచి 57 ఏళ్ల జయపాల్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మిషిగన్‌లోని 13వ స్థానం నుంచి శ్రీ థనేదర్ పోటీకి సిద్ధమయ్యారు. రిపబ్లిక్ అభ్యర్థులతో పోలిస్తే బేరా, రాజా, ఖన్నా, ప్రమీలా బలంగా ఉన్నట్లు సమాచారం. ఇక 67 ఏళ్ల థనేదర్ అరంగేట్రం చేస్తున్నారు. ఐదుగురిలో ప్రమీలా జయపాల్ ఒక్కరే మహిళా అభ్యర్థి. హోరాహోరీ పోరు ఉండే స్థానాల్లో భారతీయ అమెరికన్ ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. 50 రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తారు. సెనేట్‌లో మాత్రం 100 మంది సెనేటర్లు ఉంటారు. ప్రతి రాష్ట్రానికి సమప్రాధాన్యత అంటే రెండు సీట్లు ఉంటాయి. మరోవైపు మేరీలాండ్ రాష్ట్రంలో డెమొక్రటిక్ మహిళా అభ్యర్థిగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కోసం 57 ఏళ్ల అరుణా మిల్లర్ పోటీపడుతున్నారు. ఆమె గెలిస్తే ఈ పదవి చేపట్టే తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు. ప్రతినిధుల సభకు నవంబర్ ఎనిమిదో తేదీన పోలింగ్ జరగనుంది. -
భారత సంతతి విజేతలు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ సంతతి అభ్యర్థులు నలుగురు మళ్లీ విజయం సాధించారు. డాక్టర్ అమీ బేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలు డెమొక్రటిక్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ పడిన విషయం తెలిసిందే. అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయ అమెరికన్ల ప్రభావం అత్యధికంగా కనిపించిన ఈ ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఈ కారణం గానే అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు కూడా ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ అమెరికన్లను తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారనడం అతిశయోక్తి కాదు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ప్లారిడా, జార్జియా, మిషిగన్, నార్త్ కారొలీనా, పెన్సిల్వేనియా,టెక్సాస్లతోపాటు అమెరికా మొత్తమ్మీద సుమారు 18 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అంచనా. భారతీయ అమెరికన్ ప్రజా ప్రతినిధుల సమూహానికి ‘సమోసా కాకస్’అని సెనేటర్ రాజా కృష్ణమూర్తి పేరుపెట్టగా ఈ సారి ఈ సమూహం బలం మరికొంత పెరిగే అవకాశం ఉంది. అరిజోనాలోని ఆరవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత సభ్యుడు డేవిడ్ ష్కెవెకెర్ట్పై భారతీయ సంతతి వైద్యురాలు డాక్టర్ హీరల్ టిపిమేని ఆధిక్యంలో ఉండటం ఇందుకు కారణం. టిపిమేని (52) ఎన్నికైతే ప్రమీలా జయపాల్ తరువాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నిౖకైన రెండవ భారతీయ సంతతి మహిళా ప్రతినిధి అవుతారు. సమోసా కాకస్‌లో ప్రస్తుతం ఐదుగురు సభ్యులు ఉండగా వీరిలో నలుగురు హౌస్ ఆప్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధు లు కాగా... మిగిలిన ఒక్కరు డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సెనేటర్ కమలా హ్యారిస్. ఇల్లినాయిలోని ఎనిమిదవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 47 ఏళ్ల రాజా కృష్ణమూర్తి 1973లో న్యూఢిల్లీలో జన్మించారు. 2020 ఎన్నికల్లో లిబరిటేరియన్ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్ నెల్సన్‌ను సులువుగా ఓటమిపాలు చేశారు. కడపటి వార్తలు అందే సమయానికి రాజా కృష్ణమూర్తి మొత్తం పోలైన ఓట్లలో 71 శాతం సాధించారు. రోహిత్ ఖన్నా లేదా సంక్షిప్తంగా రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో 1976లో జన్మించిన రోహిత్ ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, భారతీయ సంతతికి చెందిన రితేశ్ టాండన్‌పై విజయం సాధించారు. సమోసా కాకస్‌లో సీనియర్ అయిన 55 ఏళ్ల డాక్టర్ అమిరేష్ బాబులాల్ బేరా కాలిఫోర్నియాలోని ఏడవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా ఐదుసార్లు గెలుస్తూ వస్తున్నారు. 2013, 2014, 2016, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన అమీ బేరా తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి బజ్ పాటెర్సన్పై 25 శాతం కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. టెక్సాస్‌లోని ఇరవై రెండవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన శ్రీ ప్రెస్టన్ కుల్కర్ణి డెమొక్రాట్ల తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రిపబ్లికన్ల అభ్యర్థి ట్రాయ్ నెల్స్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. రిపబ్లికన్ల అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన మంగ అనంతాత్ముల (వర్జీనియా) కూడా డెమొక్రటిక్ అభ్యర్థి గెర్రీ కానొలీ చేతుల్లో పరాజయం పాలయ్యారు. వీరే కాకుండా రిపబ్లికన్ల తరఫున పోటీ చేసిన మరో భారతీయ సంతతి అభ్యర్థి నిశా శర్మ కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయారు. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధి మార్క్ డిసాల్నీర్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. అమెరికా పార్లమెంటరీ వ్యవస్థలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేది దిగువ సభ కాగా.. సెనేట్ ఎగువ సభ అన్నది తెలిసిందే. -
భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు నియమితులయ్యారు. సిలికాన్ వ్యాలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా.. హౌస్ బడ్జెట్ కమిటీకి, సియాటెల్ నుంచి ఎన్నికైన ప్రమీలా జయపాల్ హౌస్ జుడీషియరీ కమిటీకి నామినేట్ అయ్యారు. షికాగో ఉత్తర, వాయవ్య ప్రాంతం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి హౌస్ ఎడ్యుకేషన్, వర్క్‌ఫోర్స్ కమిటీకి నామినేట్ అయ్యారు. దీంతోపాటే హౌస్ డెమొక్రటిక్ పాలసీ, స్టీరింగ్ కమిటీ బాధ్యతలను కృష్ణమూర్తి చూసుకోన్నారు. అమిత్ బేరా విదేశీవ్యవహారాల కమిటీ, సైన్స్, స్పేస్, టెక్నాలజీ కమిటీకి తిరిగి నామినేట్ అయ్యారు. అమెరికా సెనేట్‌కు తొలిసారి ఎన్నికైన కమలా హారిస్..బడ్జెట్ కమిటీ, నిఘా సెలక్ట్ కమిటీ, పర్యావరణ, ప్రజాపనుల కమిటీ, భద్రత, ప్రభుత్వ వ్యవహారాల కమిటీ ఇలా నాలుగు కమిటీలకు నామినేట్ అయ్యారు. ఇంతమంది భారతీయ అమెరికన్లు కీలక కమిటీలకు ఎన్నికవడం అమెరికాకాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారి. -
సిలికాన్ వ్యాలీలో పోటీకి ఖన్నా సై
వాషింగ్టన్: యువ భారత-అమెరికన్ రోహిత్ ఖన్నా(రొ ఖన్నా) మరోసారి అమెరికా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ నుంచి ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 2016 ఎన్నికల్లో ఇక్కడి నుండి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 2014 ఎన్నికల్లో సిలికాన్ వ్యాలీ నుంచి పోటీ చేయాలని భావించినా స్వల్ప తేడాతో అవకాశం కోల్పోయారు. పోటీ బిడ్ లో డెమొక్రాటిక్ పార్టీ సీనియర్ నాయకుడు మైక్ హొండా చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఖన్నా రెడీ అవుతున్నారు. మైక్ హొండా కూడా మళ్లీ సిలీకాన్ వ్యాలీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ప్రతినిధుల సభకు పోటీ చేసే అవకాశం ఎవరికీ దక్కుతుందో చూడాలి.