అమీ బేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ సంతతి అభ్యర్థులు నలుగురు మళ్లీ విజయం సాధించారు. డాక్టర్ అమీ బేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలు డెమొక్రటిక్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ పడిన విషయం తెలిసిందే. అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయ అమెరికన్ల ప్రభావం అత్యధికంగా కనిపించిన ఈ ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఈ కారణం గానే అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు కూడా ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ అమెరికన్లను తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారనడం అతిశయోక్తి కాదు.
అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ప్లారిడా, జార్జియా, మిషిగన్, నార్త్ కారొలీనా, పెన్సిల్వేనియా,టెక్సాస్‌లతోపాటు అమెరికా మొత్తమ్మీద సుమారు 18 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అంచనా. భారతీయ అమెరికన్ ప్రజా ప్రతినిధుల సమూహానికి ‘సమోసా కాకస్’అని సెనేటర్ రాజా కృష్ణమూర్తి పేరుపెట్టగా ఈ సారి ఈ సమూహం బలం మరికొంత పెరిగే అవకాశం ఉంది. అరిజోనాలోని ఆరవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత సభ్యుడు డేవిడ్ ష్కెవెకెర్ట్‌పై భారతీయ సంతతి వైద్యురాలు డాక్టర్ హీరల్ టిపిమేని ఆధిక్యంలో ఉండటం ఇందుకు కారణం. టిపిమేని (52) ఎన్నికైతే ప్రమీలా జయపాల్ తరువాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నిౖకైన రెండవ భారతీయ సంతతి మహిళా ప్రతినిధి అవుతారు. సమోసా కాకస్‌లో ప్రస్తుతం ఐదుగురు సభ్యులు ఉండగా వీరిలో నలుగురు హౌస్ ఆప్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధు లు కాగా... మిగిలిన ఒక్కరు డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సెనేటర్ కమలా హ్యారిస్.
ఇల్లినాయిలోని ఎనిమిదవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 47 ఏళ్ల రాజా కృష్ణమూర్తి 1973లో న్యూఢిల్లీలో జన్మించారు. 2020 ఎన్నికల్లో లిబరిటేరియన్ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్ నెల్సన్‌ను సులువుగా ఓటమిపాలు చేశారు. కడపటి వార్తలు అందే సమయానికి రాజా కృష్ణమూర్తి మొత్తం పోలైన ఓట్లలో 71 శాతం సాధించారు.
రోహిత్ ఖన్నా లేదా సంక్షిప్తంగా రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో 1976లో జన్మించిన రోహిత్ ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, భారతీయ సంతతికి చెందిన రితేశ్ టాండన్‌పై విజయం సాధించారు.
సమోసా కాకస్‌లో సీనియర్ అయిన 55 ఏళ్ల డాక్టర్ అమిరేష్ బాబులాల్ బేరా కాలిఫోర్నియాలోని ఏడవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా ఐదుసార్లు గెలుస్తూ వస్తున్నారు. 2013, 2014, 2016, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన అమీ బేరా తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి బజ్ పాటెర్సన్‌పై 25 శాతం కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. టెక్సాస్‌లోని ఇరవై రెండవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన శ్రీ ప్రెస్టన్ కుల్‌కర్ణి డెమొక్రాట్ల తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రిపబ్లికన్ల అభ్యర్థి ట్రాయ్ నెల్స్ ఈ స్థానం నుంచి గెలుపొందారు.
రిపబ్లికన్ల అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన మంగ అనంతాత్ముల (వర్జీనియా) కూడా డెమొక్రటిక్ అభ్యర్థి గెర్రీ కానొలీ చేతుల్లో పరాజయం పాలయ్యారు. వీరే కాకుండా రిపబ్లికన్ల తరఫున పోటీ చేసిన మరో భారతీయ సంతతి అభ్యర్థి నిశా శర్మ కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయారు. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధి మార్క్ డిసాల్‌నీర్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. అమెరికా పార్లమెంటరీ వ్యవస్థలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేది దిగువ సభ కాగా.. సెనేట్ ఎగువ సభ అన్నది తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment