Ami Bera
-
భారత సంతతి విజేతలు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ సంతతి అభ్యర్థులు నలుగురు మళ్లీ విజయం సాధించారు. డాక్టర్ అమీ బేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలు డెమొక్రటిక్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ పడిన విషయం తెలిసిందే. అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయ అమెరికన్ల ప్రభావం అత్యధికంగా కనిపించిన ఈ ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఈ కారణం గానే అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు కూడా ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ అమెరికన్లను తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారనడం అతిశయోక్తి కాదు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ప్లారిడా, జార్జియా, మిషిగన్, నార్త్ కారొలీనా, పెన్సిల్వేనియా,టెక్సాస్లతోపాటు అమెరికా మొత్తమ్మీద సుమారు 18 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అంచనా. భారతీయ అమెరికన్ ప్రజా ప్రతినిధుల సమూహానికి ‘సమోసా కాకస్’అని సెనేటర్ రాజా కృష్ణమూర్తి పేరుపెట్టగా ఈ సారి ఈ సమూహం బలం మరికొంత పెరిగే అవకాశం ఉంది. అరిజోనాలోని ఆరవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత సభ్యుడు డేవిడ్ ష్కెవెకెర్ట్పై భారతీయ సంతతి వైద్యురాలు డాక్టర్ హీరల్ టిపిమేని ఆధిక్యంలో ఉండటం ఇందుకు కారణం. టిపిమేని (52) ఎన్నికైతే ప్రమీలా జయపాల్ తరువాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నిౖకైన రెండవ భారతీయ సంతతి మహిళా ప్రతినిధి అవుతారు. సమోసా కాకస్‌లో ప్రస్తుతం ఐదుగురు సభ్యులు ఉండగా వీరిలో నలుగురు హౌస్ ఆప్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధు లు కాగా... మిగిలిన ఒక్కరు డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సెనేటర్ కమలా హ్యారిస్. ఇల్లినాయిలోని ఎనిమిదవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 47 ఏళ్ల రాజా కృష్ణమూర్తి 1973లో న్యూఢిల్లీలో జన్మించారు. 2020 ఎన్నికల్లో లిబరిటేరియన్ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్ నెల్సన్‌ను సులువుగా ఓటమిపాలు చేశారు. కడపటి వార్తలు అందే సమయానికి రాజా కృష్ణమూర్తి మొత్తం పోలైన ఓట్లలో 71 శాతం సాధించారు. రోహిత్ ఖన్నా లేదా సంక్షిప్తంగా రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో 1976లో జన్మించిన రోహిత్ ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, భారతీయ సంతతికి చెందిన రితేశ్ టాండన్‌పై విజయం సాధించారు. సమోసా కాకస్‌లో సీనియర్ అయిన 55 ఏళ్ల డాక్టర్ అమిరేష్ బాబులాల్ బేరా కాలిఫోర్నియాలోని ఏడవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా ఐదుసార్లు గెలుస్తూ వస్తున్నారు. 2013, 2014, 2016, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన అమీ బేరా తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి బజ్ పాటెర్సన్పై 25 శాతం కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. టెక్సాస్‌లోని ఇరవై రెండవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన శ్రీ ప్రెస్టన్ కుల్కర్ణి డెమొక్రాట్ల తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రిపబ్లికన్ల అభ్యర్థి ట్రాయ్ నెల్స్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. రిపబ్లికన్ల అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన మంగ అనంతాత్ముల (వర్జీనియా) కూడా డెమొక్రటిక్ అభ్యర్థి గెర్రీ కానొలీ చేతుల్లో పరాజయం పాలయ్యారు. వీరే కాకుండా రిపబ్లికన్ల తరఫున పోటీ చేసిన మరో భారతీయ సంతతి అభ్యర్థి నిశా శర్మ కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయారు. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధి మార్క్ డిసాల్నీర్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. అమెరికా పార్లమెంటరీ వ్యవస్థలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేది దిగువ సభ కాగా.. సెనేట్ ఎగువ సభ అన్నది తెలిసిందే. -
ఒబామా కేర్ : భారత-అమెరికన్ సభ్యుల మద్దతు
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మానస పుత్రిక అయిన ‘ఒబామా కేర్’కే భారత-అమెరికన్ చట్టసభ్యులు మద్దతు పలికారు. ఈ పథకాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు గురువారం ప్రతినిధుల సభలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. కొత్త బిల్లు సుమారు 24 మిలియన్ అమెరికన్ల ఆరోగ్య రక్షణ ప్రణాళికలకు ప్రతిబంధకంగా మారుతుందని వారు ఆరోపించారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు అమీ బెరా, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ‘రిపబ్లికన్లు వైట్‌హౌస్‌లో సంబరాలు చేసుకుంటుంటే మిలియన్ల కొద్ది ప్రజలు తమ ఆరోగ్య రక్షణ ప్రణాళికల గురించి దిగులు చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అర్థమవుతోంది. ఎలాంటి బడ్జెట్ విశ్లేషణ, చర్చ లేకుండానే హడావుడిగా బిల్లును ఆమోదించారు. అమెరికా ప్రజలకు ఇది చెడు రోజు’ అని అమీ బెరా అన్నారు. బిల్లును ఆమోదించడం రిపబ్లికన్లను రాజకీయంగా దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు దుర్మార్గమైనదని, ప్రభుత్వ వైద్య సాయం నుంచి 880 బిలియన్ డాలర్లకు పైగా కోత పెడుతుందని జయపాల్ అన్నారు. ముందస్తు షరతులతో 133 మిలియన్ అమెరికన్ల బీమా కవరేజీని దూరం చేస్తుందని హెచ్చరించారు. ధనికులకు భారీగా పన్నులు తగ్గించడానికే రిపబ్లికన్లు ఈ నిర్ణయం తీసుకున్నారని ఖన్నా ఆరోపించారు. ఒబామాకేర్ ముగిసిన అధ్యాయం : ట్రంప్ ఒబామా కేర్ ఇక ముగిసిన అధ్యాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వచ్చి కొద్ది కాలమే అయినా బాగానే పనిచేస్తున్నానని స్వీయ కితాబు ఇచ్చుకున్నారు. బిల్లు ఎగువ సభ అయిన సెనేట్‌లో కూడా ఆమోదం పొందుతుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేస్తున్న సమయంలో స్పీకర్ పాల్ ర్యాన్ ఆయన పక్కనే ఉన్నారు. తమ కొత్త ప్రణాళిక ఎంతో గొప్పదని, దీంతో బీమా ప్రీమియాలు దిగివస్తాయని చెప్పారు. ఒబామా కేర్ కన్నా తమ ప్రణాళిక ఎంతో మెరుగైనదని పేర్కొన్నారు.ప్రతినిధుల సభలో కొత్త బిల్లుకు ఆమోదం లభించిన తరువాత వైట్‌హౌస్‌లో సంబరాలు మొదలయ్యాయి. రిపబ్లికన్ సభ్యులకు రిసెప్షన్‌ను ఏర్పాటుచేశారు. సుమారు 70 మంది రిపబ్లికన్ సభ్యులు ఈ వేడుకలకు హాజరై ఫొటోలు దిగారు. -
అమీ బెరాకు ఏఏహెచ్ఓఏ శుభాకాంక్షలు
వాషింగ్టన్: యూఎస్ చట్టసభకు మరోసారి ఎన్నికైన ఇండియన్ అమెరికన్ అమీ బెరాకు ఆసియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ (ఏఏహెచ్ఓఏ) శుభాకాంక్షలు తెలిపింది. అమీ బెరాకు మద్దతు ఇస్తున్నందుకు తామంతా గర్విస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ఏఏహెచ్ఓఏ ఛైర్మన్ ప్రతీక పటేల్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. యూఎస్ చట్టసభకు ఎన్నికైనా అమీ బెరా ఏఏహెచ్ఓఏలో సభ్యుడని ఆమె గుర్తు చేశారు. ఆయనతో పని చేస్తూ అతిథ్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని తెలిపారు. దాదాపు పక్షం రోజుల క్రితం జరిగిన కాలిఫోర్నియాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమీబెరా గెలుపొందారు. 2012లో అమీబెరా యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్‌కు ఎన్నికయ్యారు. యూఎస్ చట్టసభకు ఎన్నికైన మూడో ఇండియన్ అమెరికన్‌గా అమీబెరా చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు బాబీ జిందాల్, దలిప్ సింగ్ సంద్లు ఎన్నికయ్యారు. -
అమెరికా ప్రతినిధుల సభలో భారత సంతతి సభ్యుడు
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ సంతతికి చెందిన ఏకైక సభ్యుడు అమిరేష్ 'అమీ' బెరా తాజా ఎన్నికలలో కూడా తన స్థానాన్ని నిలుపుకున్నారు. రెండువారాల కిందట జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసిన అమీ బెరా తొలుత తన ప్రత్యర్థి రిపబ్లిక్ పార్టీకి చెందిన డౌగ్ ఓసే కంటే 3వేల ఓట్లు వెనుకబడ్డారు. మిగిలిన ఓట్లన్నీ లెక్కించేసరికి 1,432 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2012లో కూడా అమీ బెరా గెలిచారు. ఈసారి హోరా హోరీగా జరిగిన ఎన్నికలలో మరోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించిన అమీ బెరాకు ప్రత్యర్థి డౌగ్ ఓసే అభినందనలు తెలిపారు. **