ఒబామా కేర్ : భారత-అమెరికన్ సభ్యుల మద్దతు
వాషింగ్టన్ :
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మానస పుత్రిక అయిన ‘ఒబామా కేర్’కే భారత-అమెరికన్ చట్టసభ్యులు మద్దతు పలికారు. ఈ పథకాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు గురువారం ప్రతినిధుల సభలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. కొత్త బిల్లు సుమారు 24 మిలియన్ అమెరికన్ల ఆరోగ్య రక్షణ ప్రణాళికలకు ప్రతిబంధకంగా మారుతుందని వారు ఆరోపించారు.
డెమొక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు అమీ బెరా, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ‘రిపబ్లికన్లు వైట్‌హౌస్‌లో సంబరాలు చేసుకుంటుంటే మిలియన్ల కొద్ది ప్రజలు తమ ఆరోగ్య రక్షణ ప్రణాళికల గురించి దిగులు చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అర్థమవుతోంది. ఎలాంటి బడ్జెట్ విశ్లేషణ, చర్చ లేకుండానే హడావుడిగా బిల్లును ఆమోదించారు. అమెరికా ప్రజలకు ఇది చెడు రోజు’ అని అమీ బెరా అన్నారు.
బిల్లును ఆమోదించడం రిపబ్లికన్లను రాజకీయంగా దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు దుర్మార్గమైనదని, ప్రభుత్వ వైద్య సాయం నుంచి 880 బిలియన్ డాలర్లకు పైగా కోత పెడుతుందని జయపాల్ అన్నారు. ముందస్తు షరతులతో 133 మిలియన్ అమెరికన్ల బీమా కవరేజీని దూరం చేస్తుందని హెచ్చరించారు. ధనికులకు భారీగా పన్నులు తగ్గించడానికే రిపబ్లికన్లు ఈ నిర్ణయం తీసుకున్నారని ఖన్నా ఆరోపించారు.
ఒబామాకేర్ ముగిసిన అధ్యాయం : ట్రంప్
ఒబామా కేర్ ఇక ముగిసిన అధ్యాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వచ్చి కొద్ది కాలమే అయినా బాగానే పనిచేస్తున్నానని స్వీయ కితాబు ఇచ్చుకున్నారు. బిల్లు ఎగువ సభ అయిన సెనేట్‌లో కూడా ఆమోదం పొందుతుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేస్తున్న సమయంలో స్పీకర్ పాల్ ర్యాన్ ఆయన పక్కనే ఉన్నారు. తమ కొత్త ప్రణాళిక ఎంతో గొప్పదని, దీంతో బీమా ప్రీమియాలు దిగివస్తాయని చెప్పారు. ఒబామా కేర్ కన్నా తమ ప్రణాళిక ఎంతో మెరుగైనదని పేర్కొన్నారు.ప్రతినిధుల సభలో కొత్త బిల్లుకు ఆమోదం లభించిన తరువాత వైట్‌హౌస్‌లో సంబరాలు మొదలయ్యాయి. రిపబ్లికన్ సభ్యులకు రిసెప్షన్‌ను ఏర్పాటుచేశారు. సుమారు 70 మంది రిపబ్లికన్ సభ్యులు ఈ వేడుకలకు హాజరై ఫొటోలు దిగారు.