Obama Care
-
ఒబామా కేర్ రాజ్యాంగ విరుద్ధం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాజకీయపరంగా ఓ కీలక విజయం లభించింది. గత అధ్యక్షుడు ఒబామా హయాం లో రూపొందిన ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా పథకం ‘ఒబామా కేర్’రాజ్యాంగ విరుద్ధమంటూ ఓ కోర్టు తీర్పునిచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రద్దు చేస్తామంటూ ట్రంప్ ఎన్నికల హామీ ఇచ్చారు. తాజా తీర్పుతో ఈ హామీని అమలు చేసేందుకు మార్గం సుగమమైంది. ఒబామా కేర్ పథకం రాజ్యాంగబద్ధమైనదేనంటూ 2012, 2015లలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. అయితే, ఈ పథకానికి వ్యతిరేకంగా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రాల అటార్నీలు కలిసి టెక్సస్ కోర్టులో ఈ ఏడాది దావా వేశారు. ఈ పథకంలో పేరు నమోదు చేసుకునేందుకు ఆఖరి గడువైన శనివారమే ఈ తీర్పు వెలువడటం గమనార్హం. పథకంలోని నిబంధనల ప్రకారం.. గడువులోగా పేరు నమోదు చేయించుకోని పౌరులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. టెక్సస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి రీడ్ ఓ కానర్ తన తీర్పులో..‘పన్ను విధించేందుకు కాంగ్రెస్‌కు వీలుకల్పించే పథకంగా ఇది ఉండరాదు. వ్యక్తిగత జరిమానా చెల్లించాలన్న షరతు రాజ్యాంగ విరుద్ధం. మిగతా పథకం నుంచి ఈ నిబంధనను వేరు చేయలేం. మొత్తంగా ఈ పథకం వృథా’అని పేర్కొన్నారు. ఈ తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ‘వావ్.. ఈ తీర్పు ముందుగా ఊహించిందే. అమెరికా ప్రజలకు ఇది గొప్ప వార్త. మెరుగైన ఆరోగ్య పథకం, ప్రజలకు అనుకూలమైన నిబంధనలతో కూడిన చట్టాన్ని తీసుకురావడం కాంగ్రెస్ బాధ్యత’అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే, టెక్సస్ కోర్టు తీర్పును ప్రతిపక్ష డెమోక్రట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అధ్యక్షుడు ట్రంప్ అనుకూల జడ్జి ఈ తీర్పు చెప్పారని విమర్శించారు. -
ఒబామా కేర్ : భారత-అమెరికన్ సభ్యుల మద్దతు
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మానస పుత్రిక అయిన ‘ఒబామా కేర్’కే భారత-అమెరికన్ చట్టసభ్యులు మద్దతు పలికారు. ఈ పథకాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు గురువారం ప్రతినిధుల సభలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. కొత్త బిల్లు సుమారు 24 మిలియన్ అమెరికన్ల ఆరోగ్య రక్షణ ప్రణాళికలకు ప్రతిబంధకంగా మారుతుందని వారు ఆరోపించారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు అమీ బెరా, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ‘రిపబ్లికన్లు వైట్‌హౌస్‌లో సంబరాలు చేసుకుంటుంటే మిలియన్ల కొద్ది ప్రజలు తమ ఆరోగ్య రక్షణ ప్రణాళికల గురించి దిగులు చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అర్థమవుతోంది. ఎలాంటి బడ్జెట్ విశ్లేషణ, చర్చ లేకుండానే హడావుడిగా బిల్లును ఆమోదించారు. అమెరికా ప్రజలకు ఇది చెడు రోజు’ అని అమీ బెరా అన్నారు. బిల్లును ఆమోదించడం రిపబ్లికన్లను రాజకీయంగా దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు దుర్మార్గమైనదని, ప్రభుత్వ వైద్య సాయం నుంచి 880 బిలియన్ డాలర్లకు పైగా కోత పెడుతుందని జయపాల్ అన్నారు. ముందస్తు షరతులతో 133 మిలియన్ అమెరికన్ల బీమా కవరేజీని దూరం చేస్తుందని హెచ్చరించారు. ధనికులకు భారీగా పన్నులు తగ్గించడానికే రిపబ్లికన్లు ఈ నిర్ణయం తీసుకున్నారని ఖన్నా ఆరోపించారు. ఒబామాకేర్ ముగిసిన అధ్యాయం : ట్రంప్ ఒబామా కేర్ ఇక ముగిసిన అధ్యాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వచ్చి కొద్ది కాలమే అయినా బాగానే పనిచేస్తున్నానని స్వీయ కితాబు ఇచ్చుకున్నారు. బిల్లు ఎగువ సభ అయిన సెనేట్‌లో కూడా ఆమోదం పొందుతుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేస్తున్న సమయంలో స్పీకర్ పాల్ ర్యాన్ ఆయన పక్కనే ఉన్నారు. తమ కొత్త ప్రణాళిక ఎంతో గొప్పదని, దీంతో బీమా ప్రీమియాలు దిగివస్తాయని చెప్పారు. ఒబామా కేర్ కన్నా తమ ప్రణాళిక ఎంతో మెరుగైనదని పేర్కొన్నారు.ప్రతినిధుల సభలో కొత్త బిల్లుకు ఆమోదం లభించిన తరువాత వైట్‌హౌస్‌లో సంబరాలు మొదలయ్యాయి. రిపబ్లికన్ సభ్యులకు రిసెప్షన్‌ను ఏర్పాటుచేశారు. సుమారు 70 మంది రిపబ్లికన్ సభ్యులు ఈ వేడుకలకు హాజరై ఫొటోలు దిగారు. -
‘ఒబామా కేర్’ రద్దుకు ఆమోదం
వాషింగ్టన్: ఒబామా కేర్‌ను రద్దు చేస్తూ, కొత్త వైద్య విధానానికి ఆమోదం తెలుపుతూ అమెరికా ప్రతినిధుల సభ గురువారం అనుకూలంగా ఓటేసింది. కొత్తగా రూపొందించిన అమెరికన్ హెల్త్ కేర్ యాక్ట్‌కు 217–213 ఓట్ల తేడాతో సభ ఆమోదం తెలిపింది. డెమోక్రాట్ సభ్యులంతా కొత్త బిల్లును వ్యతిరేకించగా.. రిపబ్లికన్లు అనుకూలంగా ఓటేశారు. అయితే దాదాపు 20 మంది రిపబ్లికన్లు బిల్లును వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ ఓటింగ్ కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నామని ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్ పేర్కొన్నారు. అయితే ఈ బిల్లును సెనెట్ ఆమోదించాల్సి ఉంది. -
ఇదే సరైన సమయం: డొనాల్ట్ ట్రంప్
వాషింగ్టన్: మార్పు, కచ్చితమైన చర్యల కోసమే దేశ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒబామా హెల్త్‌కేర్ తదితర పథకాల రద్దు విషయమై ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల అమలు వేగం పెంచడంపై తనను తాను ఆయన సమర్థించుకున్నారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘చరిత్రాత్మక మార్పు కోసం గతేడాది నవంబర్ 8న అమెరికన్ ప్రజలు ఓటు వేశారు. కచ్చితమైన చర్యలను ఆశిస్తూ హౌజ్, సెనేట్, వైట్ హౌస్ లను అప్పగించారు. ప్రజలు మనకు స్పష్టమైన సూచనలు చేశారు. పని పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం’ అని పేర్కొన్నారు. ‘గురువారం నాటి కీలకమైన ఓటుతో చట్టబద్ధమైన ప్రయత్నం ప్రారంభమవుతుంది. విపత్తు వంటి ఒబామా కేర్‌ను రద్దు చేసి కొత్తదాన్ని ప్రవేశపెట్టడానికి రిపబ్లికన్ పార్టీకి, దేశ ప్రజలకు కూడా ఆ ఓటు కీలకమే’ అని ట్రంప్ తెలిపారు. దేశంలో నెలకొన్న నూతన వ్యాపార వాతావరణం వల్లే అమెరికా ఉద్యోగాలు వెనక్కి వస్తున్నాయని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. మరోవైపు విదేశీయులపై అమెరికన్లు జాతి విద్వేష దాడులకు పాల్పడుతున్నా ఏ చర్యలు తీసుకోకుండా, కేవలం అమెరికన్లకు ఉద్యోగాలు, వారి అభివృద్ధి మాత్రమే తనకు ముఖ్యమని పేర్కొంటూ ట్రంప్ తన శైలిలో పాలన కొనసాగిస్తున్నారు. -
'షట్‌డౌన్'కు ముగింపు పలకండి: జాన్ కెర్రీ
వాషింగ్టన్: అమెరికా వార్షిక బడ్జెట్ ఆమోదించడంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో మొదలైన షట్డౌన్కు ముగింపు పలకాలని చట్టసభ(కాంగ్రెస్)ను విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కోరారు. 'ఒబామా కేర్' పథకం విషయంలో తలెత్తిన అనిశ్చితి త్వరలోనే తొలగిపోతుందని అంతర్జాతీయ సమాజానికి ఆయన హామీయిచ్చారు. చట్టసభలో చిన్నవర్గం కారణంగా తలెత్తిన ఈ ప్రతిష్టంభనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు డెమోక్రాట్లు సహకరించాలని ఆయన కోరారు. 'మన విభేదాలపై ప్రపంచమంతా దృష్టి సారించింది. ఇటువంటి సమయంలో అమెరికా రాజకీయాల్లో ఎలాంటి తప్పు జరగరాదు' అని జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు. కాగా, తన మానసపుత్రిక ‘ఒబామాకేర్’ బీమా బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని అధ్యక్షుడు బరాక్ ఒబామా తేల్చిచెప్పారు. ఏ విధమైన మార్పులు, చేర్పులు లేకుండా బిల్లును ఆమోదించాలని ప్రతిపక్షాలకు మరోసారి సూచించారు. ప్రస్తుత షట్‌డౌన్ పరిస్థితి వల్ల రుణాలు చెల్లించకపోతే దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, అందుకే బడ్జెట్‌ను ఆమోదించి ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని తన వారాంతపు సందేశంలో ప్రతిపక్షాలను కోరారు. మరోవైపు జీతాలు కోరకుండా పనిచేయాలని ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని చట్టాల చట్రంలో ఎంతోకాలం బంధించలేరని, పుట్టబోయే బిడ్డని ఆపడం వారి వల్ల కాదని చెప్పారు. అయితే ఈ నెల 17 లోపు రుణపరిమితి పెంపుపై అమెరికా చట్టం చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, షట్‌డౌన్ ముగిసిన తర్వాత సుమారు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు షట్‌డౌన్ కాలానికి జీతాలు చెల్లించేందుకు అమెరికా ప్రతినిధుల సభ అంగీకరించింది. రిపబ్లికన్ల ఆధిక్యం గల ప్రతినిధుల సభ శనివారం ఈ మేరకు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది.