'షట్‌డౌన్'కు ముగింపు పలకండి: జాన్ కెర్రీ
వాషింగ్టన్: అమెరికా వార్షిక బడ్జెట్ ఆమోదించడంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో మొదలైన షట్‌డౌన్కు ముగింపు పలకాలని చట్టసభ(కాంగ్రెస్)ను విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కోరారు. 'ఒబామా కేర్' పథకం విషయంలో తలెత్తిన అనిశ్చితి త్వరలోనే తొలగిపోతుందని అంతర్జాతీయ సమాజానికి ఆయన హామీయిచ్చారు. చట్టసభలో చిన్నవర్గం కారణంగా తలెత్తిన ఈ ప్రతిష్టంభనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు డెమోక్రాట్లు సహకరించాలని ఆయన కోరారు. 'మన విభేదాలపై ప్రపంచమంతా దృష్టి సారించింది. ఇటువంటి సమయంలో అమెరికా రాజకీయాల్లో ఎలాంటి తప్పు జరగరాదు' అని జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు.
కాగా, తన మానసపుత్రిక ‘ఒబామాకేర్’ బీమా బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని అధ్యక్షుడు బరాక్ ఒబామా తేల్చిచెప్పారు. ఏ విధమైన మార్పులు, చేర్పులు లేకుండా బిల్లును ఆమోదించాలని ప్రతిపక్షాలకు మరోసారి సూచించారు. ప్రస్తుత షట్‌డౌన్ పరిస్థితి వల్ల రుణాలు చెల్లించకపోతే దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, అందుకే బడ్జెట్‌ను ఆమోదించి ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని తన వారాంతపు సందేశంలో ప్రతిపక్షాలను కోరారు.
మరోవైపు జీతాలు కోరకుండా పనిచేయాలని ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని చట్టాల చట్రంలో ఎంతోకాలం బంధించలేరని, పుట్టబోయే బిడ్డని ఆపడం వారి వల్ల కాదని చెప్పారు. అయితే ఈ నెల 17 లోపు రుణపరిమితి పెంపుపై అమెరికా చట్టం చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, షట్‌డౌన్ ముగిసిన తర్వాత సుమారు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు షట్‌డౌన్ కాలానికి జీతాలు చెల్లించేందుకు అమెరికా ప్రతినిధుల సభ అంగీకరించింది. రిపబ్లికన్ల ఆధిక్యం గల ప్రతినిధుల సభ శనివారం ఈ మేరకు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది.