సింగపూర్ నుంచి మలేసియాకు రోడ్డుమార్గాన వెళ్లిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల సింగపూర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రోడ్డు మార్గాన మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు ప్రయాణించారు. ఉదయం 11 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కౌలాలంపూర్ చేరుకున్నారు. సింగపూర్ మీదుగా మలేసియా వరకు జరిగిన అభివృద్ధిని స్వయంగా పరిశీలించేందుకు రోడ్డు మార్గంలో ప్రయాణించాలని కేసీఆర్ ఇంతకుముందే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. పట్టణ ప్రణాళిక, పారిశ్రామికీకరణ, రవాణా వ్యవస్థ తదితర అంశాలను అధ్యయనం చే సి ఓ అంచనాకు వచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయాణం చేపట్టారు.
గతంలో కొందరు ప్రముఖులు కూడా ఈ సలహా ఇవ్వడంతో సీఎం ఇందుకు మొగ్గు చూపారు. కౌలాలంపూర్‌లో కేసీఆర్‌కు అక్కడి తెలంగాణ ప్రముఖులు, ప్రజలు సాదర స్వాగతం పలికారు. నగరంలోని ‘ది వెస్టిన్’ హోటల్లో ఆయన బస చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో కొందరు పారిశ్రామికవేత్తలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం మలేసియా ప్రభుత్వ ఉన్నతాధికారి, దక్షిణాసియా మౌలిక సదుపాయాలపై భారత వ్యవహారాల ప్రత్యేక రాయబారి దటావ్ సెరీస్ సామివెళ్లుతో ముఖ్యమంత్రి, ఇతర అధికారులు ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. కాగా, ఆదివారం నాడు కేసీఆర్ మలేసియాలోని పుత్రజయ, సైబర్‌జయ నగరాలను సందర్శించనున్నారు. తర్వాత అదేరోజు కౌలాలంపూర్‌కు చేరుకుని రాత్రికి హైదరాబాద్‌కు పయనమవుతారు.