బ్రెయిన్ భర్తీ అయితే చెబుతుంది..!
చదవడం వల్లనో, లేక ఎక్కువ విషయాలను నిక్షిప్తం చేసుకోవడం వల్లనో అలసిన, ఇక కొత్త విషయాలను పట్టించుకోలేని మెదడును ఇట్టే గుర్తించేస్తామని అంటున్నారు అమెరికన్ శాస్త్రజ్ఞులు. చిన్న హెడ్‌బ్యాండ్ రూపంలోని పరికరాన్ని తలకు ధరిస్తే చాలు... మెదడు సమాచారంతో భర్తీ అయ్యిందా లేదా? అనే విషయాన్ని తేల్చేయగలమని వారు అంటున్నారు. ప్రస్తుతం ఆ పరికరాన్ని రూపొందించే పనిలో ఉన్నామని, త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వారు ప్రకటించారు. టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ రాబర్ట్ జాకబ్, బయోమెడికల్ ఇంజనీర్ సెర్గియో ఫాంతిని అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని రూపొందిస్తున్నారు.
ఎక్కువసేపు ఆలోచించడం, చదవడం వంటి విషయాలతో మెదడు అలసిపోయినప్పుడు మెదడులోని అంతర్గత వ్యవస్థలో కలిగే మార్పులను గుర్తించడం ద్వారా ఈ పరికరం పనిచేస్తుందని వారు వివరించారు. దీన్ని ధరించడం వల్ల ఎలాంటి నొప్పి, ప్రమాదమూ ఉండదని వారు హామీ ఇస్తున్నారు. దీన్ని బ్రెయిన్ రీడర్ అని అనలేమని.. కేవలం మనిషి మెదడు స్థితిని బట్టి మాత్రమే ఇది స్పందిస్తుందని, కనెక్ట్ చేసి ఉంచిన కంప్యూటర్ ద్వారా మెదడు పరిస్థితి గురించి వివరించగలదని వారు చెప్పారు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మెదడు ‘ఓవర్‌లోడ్’ అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చే దీనివల్ల మెదడు గురించి అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి మనిషి మెదడు సామర్థ్యమూ భిన్నమైన స్థాయిల్లో ఉంటుందని... ఈ పరికరం ద్వారా మెదడు ‘ఓవర్‌లోడ్’ అయిన వారికి విశ్రాంతి ఇవ్వవచ్చని వివరించారు.